రేషన్ షాపుపై విజిలెన్స్ దాడి
Published Tue, Jan 7 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
చీపురుపల్లి,న్యూస్‌లైన్: చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆకులపేట రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. ఉమాకాంత్ ఆధ్వర్యంలో జరిపిన ఆకస్మిక దాడిలో రేషన్ దుకాణంలో సరుకుల తేడా కనిపించింది. దీంతో రేషన్‌షాపు రికార్డులు సీజ్ చేసి, నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల్లో 100 కేజీల బియ్యం తక్కువగాను, 30 కేజీల గోధుమపిండి ఎక్కువగాను, 200 కేజీల ఉప్పు అధికంగాను ఉన్నాయని చెప్పారు.
రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, ధరల పట్టిక కూడా దుకాణం వద్ద లేదని తెలిపారు. ఆకులపేటలో రేషన్ దుకాణం నిర్వహించేందుకు అనుమతి, నిర్వాహకుడి వద్ద లెసైన్స్ కూడా లేదన్నారు. దీనికి డీలర్ మాట్లాడుతూ లెసైన్స్ పునరుద్ధరణకు ఇచ్చామన్నారు. ఏది ఏమైనప్పటికీ రికార్డులకు, సరుకులకు తేడా ఉండడంతో రికార్డులు సీజ్ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. తేడా వచ్చిన సరుకులను సీఎస్‌డీటీ జి.జనార్దన్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి.రామకృష్ణ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు ఎస్‌ఐ అప్పలనాయుడు, హెచ్‌సీ లక్ష్మణ్, వీఆర్‌ఓ రమణమూర్తి తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement