ఈవో హరిసూర్యప్రకాష్ తదితరుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న విజిలెన్స్ అధికారులు
సాక్షి, అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయ కార్యాలయంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రీజనల్ విజిలెన్స్ అధికారి పనసారెడ్డి ఆదేశాల మేరకు సీఐలు చంద్ర, ప్రకాష్, స్వామినాయుడులతోపాటు ఎస్సై కిరణ్‌కుమార్ తదితర బృందాలు ఆలయంలో పలు విభాగాల్లో ఉదయం 6.30 గంటల నుంచి తనిఖీలను మొదలు పెట్టారు. బృందాలుగా విడిపోయి కేశఖండనశాల, ప్రసాదాల విభాగంతోపాటు ముఖ్య కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి టెండర్‌దారుడి నుంచి వచ్చిన పచారి సరుకుల నాణ్యతను పరిశీలించారు. జీడిపప్పు, కిస్మిస్ తదితర వస్తువుల నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అలాగే గత రథసప్తమి టెండర్లు, వివిధ ఆర్జిత సేవల టిక్కెట్లు, దర్శన మార్గ టిక్కెట్లు, విరాళాలు, బ్యాంకు లావాదేవీలు, ఆలయ భూముల వివరాలతోపాటు తలనీలాలు, కొబ్బరికాయల టెండర్ ప్రక్రియలు ఖరారైన తీరుతెన్నులను ప్రధానంగా పరిశీలించి, అనుమానమున్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ అన్ని విభాగాల్లోనూ తనిఖీలు చేశామని, పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ప్రస్తుతం ఆలయ రికార్డుల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని, దీంతో తాజాగా విజిలెన్స్ అధికారులకు కావాల్సిన రికార్డులను, సమాచారాన్ని వెంటనే ఇచ్చే వీలు కలిగిందన్నారు. తమ ఆలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు పూర్తిగా సహకరించారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment