సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెంపు లక్ష్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో సమీకృత చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్కెటింగ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్ యార్డుల పరిధిలో చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నా.. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సరిపడినంత సిబ్బంది, పర్యవేక్షణకు అవసరమైన మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో కలిసి సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ మొగ్గు చూపుతోంది.
ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులను నిర్వహిస్తుండగా.. ఇతర శాఖలతో కలిసి సమీకృత చెక్‌పోస్టుల సంఖ్యను 16కు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై మార్కెటింగ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. చెక్‌పోస్టుల వద్ద రవాణా వాహనాలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను తరలించే వాహనాల వివరాల నమోదుకు కామన్ ఎంట్రీ పాయింట్ ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. కామన్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం, ఫర్నీచర్ తదితర మౌలిక సౌకర్యాల కల్పన వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు.
మూడు షిఫ్టుల్లో వాహనాల తనిఖీ, వివరాల నమోదుకు.. షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. ఈ ఇద్దరిలో ఒకరు సహాయ కార్యదర్శి, మరొకరు సూపర్‌వైజర్ ఉంటారు. వాహనాల బరువును తూకం వేసేందుకు చెక్‌పోస్టుల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నివేదికలో పేర్కొన్నారు. వివిధ వాహనాల బరువును తూకం వేసేందుకు ప్రత్యేక వరుసలను ఏర్పాటు చేయాలని.. సీజ్ చేసే వాహనాలను నిలిపేందుకు షెడ్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు.
నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకే!
రాష్ట్రంలో ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. చెక్‌పోస్టుల ద్వారా లభించే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా రూ.358.57 కోట్లను మార్కెట్ ఫీజు లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావంతో సాగు విస్తీర్ణంపై ప్రభావం, పత్తి విత్తనాలు, బియ్యంపై మార్కెట్ ఫీజు వసూలు విషయంలో అస్పష్టత నేపథ్యంలో మార్కెట్ ఫీజు వసూలుపై ప్రభావం పడుతోంది. వరి ధాన్యం, వేరుశనగ, ఇతర పప్పుధాన్యాలను రాష్ట్ర సరిహద్దులు దాటకుండా చూడటం ద్వారా మార్కెట్ ఫీజు వసూలును పెంచాలని భావిస్తున్నారు. అయితే సొంతంగా చెక్‌పోస్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక సౌకర్యాలు మార్కెటింగ్ శాఖకు లేకపోవడంతో.. తనిఖీలు, ఆదాయంపై ప్రభావం చూపుతోంది.
మరోవైపు అలంపూర్ క్రాస్ రోడ్డు వంటి జాతీయ రహదారులపై సొంతంగా చెక్‌పోస్టుల ఏర్పాటు, నిర్వహణ కష్టసాధ్యమని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. రవాణా, వాణిజ్య, ఎక్సైజ్ శాఖలు సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయా శాఖలతో కలిసి వీటిని ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణ భారం తగ్గించుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది.
సరిహద్దుల్లో సమీకృత చెక్‌పోస్టులు
Published Sun, Aug 28 2016 2:44 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement