ఆదిలాబాద్ మార్కెట్‌కు వచ్చిన పత్తి
సాక్షి,ఆదిలాబాద్/ఖమ్మం వ్యవసాయం: ఆదిలాబాద్‌లో పత్తి రైతులు ఆందో ళన బాట పట్టారు. తేమ పేరిట ధరను అడ్డగోలుగా తగ్గించడంపై బుధవారం నిరసన వ్యక్తం చేస్తూ మార్కెట్‌యార్డులో బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగినా వ్యాపారులతో అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో యార్డు నుంచి రోడ్డుపైకి వచ్చిన రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు.
తేమ విషయంతో మొదలు..
ఆదిలాబాద్ మార్కెట్‌లో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర కోసం వేలం నిర్వహించారు. 8 శాతం తేమ ఉన్న పత్తి క్వింటాలుకు రూ.4,570 ధర నిర్ణయించారు. యార్డు నుంచి జిన్నింగ్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ తేమ శాతాన్ని చూస్తూ క్వింటాలుకు రూ.3,800 వరకే ఇస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. 8 శాతం నుంచి కాకుండా 12 శాతం నుంచి తేమను పరిగణన లోకి తీసుకోవాలని, ఆపై అదనంగా వచ్చే తేమ శాతానికి ధర కోత విధించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జేసీ కృష్ణారెడ్డి మంత్రి జోగురామన్నతో సమస్యపై వివరించగా, వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వ్యాపారులు దిగిరాకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు 25వేల క్వింటాళ్ల వరకు పత్తిని రైతులు వాహనాల్లో తీసుకొచ్చారు. ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే కుట్ర చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌కు బుధవారం సుమారు 30వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చింది. 24,700 బస్తాల పత్తి విక్రయానికి వచ్చినట్లు రికార్డు అయింది. బాగా ఆరబెట్టి గ్రేడింగ్ చేసి విక్రయానికి తెచ్చిన పత్తిని కూడా వ్యాపారులు కుంటిసాకులు చెబుతూ క్వింటాల్‌కు సగటున రూ. 2,500 నుంచి రూ.3 వేలకు మించి ధర పెట్టడం లేదు.