
మార్కెట్లలో సోలార్ వెలుగులు
చౌటుప్పల్: వ్యవసాయ మార్కెట్ల లో ఇక సోలార్ విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందు కు మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,024.50 కోట్ల అంచనా వ్యయంతో 330 గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా చౌటుప్పల్ యార్డు ఆవరణలో రూ.33 కోట్ల వ్యయంతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించారు. సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా గోదాముల పైకప్పుపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. 9 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో మార్కెట్ వెలుపల, గోదాములలో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. గురువారంరాత్రి సోలార్ లైట్లను ట్రయల్ రన్ చేశారు. విద్యుత్ కాంతుల్లో మార్కెట్‌యార్డు మిరిమిట్లు గొలుపుతోంది. ఇక నుంచి మార్కెట్‌కు కరెంటు బిల్లుల భారం తప్పనుంది.