‘మార్కెట్’ రిజర్వేషన్లకు చట్టబద్ధత!
♦ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి కసరత్తు
♦ మార్కెట్ ఫీజు,లెసైన్సింగ్‌లో నూతన విధానం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. నూతన విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనలకు చట్టబద్ధత కల్పిస్తూ.. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. 1966 నాటి వ్యవసాయ మార్కెట్ చట్టానికి సవరణలు చేయనున్నారని సమాచారం. గతంలో వ్యవసాయ మార్కెట్ చట్టం 1966లోని సెక్షన్ 5(1) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల కేటగిరీ నుంచి పాలక మండలిలో ఐదుగురు సభ్యులను నియమించుకునే అధికారం మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల్లో కేటగిరీల వారీగా రిజర్వేషన్లకు వీలు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 15న జీవో 87ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో 50 శాతం కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున చైర్మన్ పదవులు కేటాయిస్తూ.. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్‌లు నిర్ణయించాలని ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను.. పీసా (పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా) నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను పూర్తిగా గిరిజనులకు కేటాయించారు. మిగిలిన 168 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గత ఏడాది సెప్టెంబర్ 22న రిజర్వేషన్లు ఖరారు చేశారు. జీఓ 87ను అసెంబ్లీలో ఆమోదించి.. చట్టబద్ధత కల్పించడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా చూడటమే ప్రధాన ఉద్దేశమని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీలో ఆమోదం తర్వాత.. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్, పాలక మండలి సభ్యుల నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
‘నామ్’ అమలుకు వీలుగా సవరణలు
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) పథకంలో భాగంగా.. రాష్ర్టంలోని 44 వ్యవసాయ మార్కెట్లను జాతీయ వ్యవసాయ మార్కెట్లతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానంలో వ్యాపారులు.. నామ్ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ వ్యవసాయ మార్కెట్ నుంచైనా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది. సెప్టెంబర్ 16 నాటికి ఎంపిక చేసిన 44 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కంప్యూటరీకరించి.. లావాదేవీలు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం మార్కెట్ కమిటీల్లో అమల్లో వున్న లెసైన్సింగ్, మార్కెట్ ఫీజు వసూలు విధానంలోనూ మార్పులు చేస్తే తప్ప ‘నామ్’లో చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నామ్ పథకం అమలుకు వీలుగా 1966 నాటి వ్యవసాయ మార్కెట్ చట్టం నిబంధనల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.