పీసా చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్‌ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ...
సాక్షి, హైదరాబాద్: పీసా చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ మార్కె ట్ కమిటీల చైర్మన్‌ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టం ప్రకారం కేటాయించిన 11 కమిటీల్లో నాలుగింటిని మంగళవారం లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్ఛోడ, ఖమ్మం జిల్లా బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఎస్టీ మహిళలకు రిజర్వు అయ్యాయి. ములుగు (వరంగల్), ఇంద్రవెళ్లి, జైనూరు (ఆదిలాబాద్), ఎల్లందు, కొత్తగూడెం, ఎన్కూరు, నూగూరుచర్ల మార్కెట్ కమిటీలను ఎస్టీ జనరల్‌గా ఎంపిక చేశారు.
రాష్ట్రంలో 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ ప్రకారం ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున కమిటీ చైర్మన్ పదవులు కేటాయిస్తూ గతేడాది సెప్టెంబర్‌లో రిజర్వేషన్లు ఖరారు చేశారు.
మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు
రాష్ట్రంలోని రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దాసరి గీత, వైస్ చైర్మన్‌గా బర్మవత్ మోతీరాంను నియమించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పత్తి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్‌గా ధర్మనగారి వెంకట్‌రెడ్డి నామినేట్ అయ్యారు.