పత్తి.. పండలే..  | Cotton Crop And Khammam Agriculture | Sakshi
Sakshi News home page

పత్తి.. పండలే.. 

Published Sat, Jan 5 2019 7:48 AM | Last Updated on Sat, Jan 5 2019 7:48 AM

Cotton Crop And Khammam Agriculture - Sakshi

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన పత్తి

ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్‌లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు.

సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్‌లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి.

వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్‌ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్‌లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు.
 
సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం 
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు.

ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. 
ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి.
 
ముంచిన తెగుళ్లు, వర్షాలు 
ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్‌లో ‘పెథాయ్‌’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది.

వెలవెలబోయిన మార్కెట్లు 
జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్‌లో ఖమ్మం మార్కెట్‌లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. 

పత్తి స్థానంలో మొక్కజొన్న 
ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది.   
 
నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. 
నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది.  – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం 
 
ఆశించిన దిగుబడి రాలేదు.. 

ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్‌లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్‌ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది.  – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement