కందుల కథ కంచికే!
Published Mon, Feb 27 2017 12:51 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
నారాయణపేట : గత నెల 11న నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కేంద్రంలో ఓ హమాలీ రైతు అవతారమెత్తాడు. 58బస్తాల కందులను అక్రమ మార్గంలో విక్రయించేందుకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో సరుకు సంబంధించిన పట్టదారు పుస్తకం వివరాలను యార్డు అధికారులు ప్రశ్నించగా సదరు హమాలీ ఆ సరుకును అక్కడే వదిలి చిత్తగించారు. అ తర్వాత తమ సరుకు అని పేర్కొంటూ యార్డు అధికారులను సంప్రదిస్తే నీ పూర్తిస్థాయి భూమి ఎంత సర్వే నెంబర్ వివరాలను సమర్పించాల్సిందిగా సూచించారు.
ఆరోపణలు ఎదురుకుంటున్న సదరు కమిషన్ ఏజెంట్‌కు యార్డు అధికారులు నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పట్టుబడిన రోజేమో ఆ కందులు సంబంధిత యార్డు కమిషన్ ఏజెంట్‌వేనని పేర్కొంటూ వచ్చిన మార్కెట్ అధికారులు, తీరా నెలరోజుల తర్వాత ప్లేటు ఫిరాయించారు. మరో విధంగా సమాధానం ఇస్తుండటం మరిన్నీ అనుమానాలకు దారితీస్తోంది.
ఇదండీ మార్కెట్ అధికారుల పనితీరు
ఈ నెలరోజుల వ్యవధిలో సరుకును న్యాయబద్ధంగా విక్రయిస్తున్నట్లు అటు యార్డు అధికారులు, ఇటు సంబంధిత కమిషన్ ఏజెంట్ తెర వెనుక పావులు కదిపి ఆలస్యంగా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిచే ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, మార్కెట్ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంబంధిత రైతుకు సంబంధించిన సరుకు ఉన్నట్లయితే ఇన్ని రోజులు తమ సరుకుయార్డులో ఉంచరు. నెల రోజుల వ్యవధిలో కేవలం రెవెన్యూ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా మార్కెట్ అధికారులు మొత్తం 58 బస్తాల్లో 50 బస్తాలు ఇద్దరు రైతులకు సంబంధించినవిగా మిగతా 8 బస్తాలు కమిషన్ ఏజెంట్‌గా చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి ఈ వ్యవహరం నడిచేందుకు నెలరోజుల సమయం ఎందుకు పట్టిందనే విషయంపై ఆ అధికారులే స్పష్టం చేయాలి. మరో విషయమేమిటంటే ఆ రోజున మొత్తం 58బస్తాలు రైతులవి కావని.. ఇప్పుడేమో 50బస్తాలు రైతులవని, 8 బస్తాలు కమిషన్ ఏజెంట్‌వని పేర్కొనడం గమనార్హం. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ 58బస్తాల కందుల వ్యవహారంపై పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న 50 బస్తాలు సంబంధిత రైతులకు, 8 బస్తాలను కమిషన్ ఏజెంట్‌కు తిరిగి ఇచ్చేశామని మార్కెట్ కార్యదర్శి గోపాల్ చల్లగా సమాధానం దాటవేశారు.
సంతకం చేశాను.. నాకేం తెలియదు
నేను ఎక్లాస్‌పూర్‌లో పనిఒత్తిడిలో ఉన్న సమయంలో ఏమరుపాటు చేసి గ్రామస్తులు కొందరు ఆ కాగితాలపై సంతకం తీసుకున్నారు. గంజ్‌లో జరిగిన వ్యవహారం గురించి నాకు తెలియదు. గ్రామంలో రైతులకు పంట వేసే సమయంలో తాము ఏవిధంగా అయితే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామో అలాగే సంతకం చేశా. ఇందులో నా ప్రమేయం ఏమిలేదు. – అనంత్‌రెడ్డి, ఎక్లాస్‌పూర్ వీఆరోఓ
Advertisement