ఏఎంసీ.. సేవలు నాస్తి
ఏఎంసీ.. సేవలు నాస్తి
Published Wed, Sep 28 2016 10:13 PM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
చింతలపూడి:
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
సెస్ వసూలుకే పరిమితం
సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు.
ప్రభుత్వ పరిధిలో ఉంది
మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం.
– పి.ఛాయాదేవి,
ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ
పోస్టులు భర్తీ
కోరుతున్నాం
మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది.
– టీటీఎస్‌వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం
Advertisement