ధూమ్‘నామ్’..
♦ ధాన్యం కొనుగోళ్లలో కొత్త విధానం
♦ ఐదు వ్యవసాయ మార్కెట్లలో అమలు
♦ రైతన్నకు మేలు.. ‘జీరో’కు చెక్
♦ గిట్టుబాటు ధరకు అవకాశం
♦ ఏ వ్యాపారైనా.. ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయవచ్చు
జహీరాబాద్ : వ్యవసాయ మార్కెట్లలో జాతీయ మార్కెటింగ్ విధానం (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్.. నామ్) అమల్లోకి వచ్చింది. సోమవారం ఈ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ‘నామ్’ విధానం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు దోహద పడుతుంది. ఈ విధానాన్ని జిల్లాలోని జహీరాబాద్, సిద్దిపేట, సదాశివపేట, గజ్వేల్, జోగిపేట మార్కెట్ యార్డులలో అమలు పరుస్తున్నారు. ఈ విధానంలో దేశంలోని ఏ ప్రాంతంలోని లెసైన్స్ వ్యాపారి అయినా కొనుగోలు చేసుకోవచ్చు. మార్కెట్‌కు విక్రయం నిమిత్తం రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని ముందుగా గేటు వద్ద ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రైతుకు లాట్ కోడ్ నెంబర్ ఇస్తారు. గేట్ ఎంట్రీ పాసును అందజేస్తారు. సదరు రైతు తీసుకువచ్చిన ధాన్యం పేరు, ఏయే ధాన్యం ఎన్ని బస్తాల్లో తీసుకువచ్చారు, సుమారు ఎంత తూకం ఉంటుందనే వివరాలను గేటు వద్దే న మోదు చేస్తారు. అనంతరం రైతు విక్రయించే కమిషన్ ఏజెంట్ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రైతు సరఫరా చేసే ధాన్యానికి సంబంధించిన పేరు, తండ్రి పేరు, గ్రామం, మొబాయిల్ నెంబరు, విక్రయించే కమిషన్ ఏజెంట్ పేరును నమోదు చేస్తారు. అంతే కాకుండా ఎలాంటి వాహనంలో ధాన్యం తీసుకువచ్చారనే వివరాలను కూడా లాట్ ప్రొఫార్మలో పొందు పరుస్తారు. వాహనం తిరిగి గేటు బయలకు వెళ్లే ముందు కూడా ఏమైన సరుకులను వాపసు తీసుకెళుతున్నదీ లేనిదీ నమోదు చేస్తారు.
రైతులకు ఉపయోగకరం
జాతీయ మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు లబ్ధిచేకూరుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారులకు అవకాశం ఉండదు. రైతులు మార్కెట్‌కు విక్రయం నిమిత్తం తీసుకువచ్చిన ధాన్యం నాణ్యతను నిర్ణయిస్తారు. తేమ శాతం, మట్టి శాతం ఏ మేరకు ఉందనేది ప్రత్యేక విభాగం ద్వారా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ధాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అనంతరం ఆన్‌లైన్‌లో వ్యాపారులు తాము కొనుగోలు చేసే ధాన్యానికి సంబంధించి ధర నిర్ణయిస్తారు. రైతు అంగీకారం ఉంటేనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే రైతు స్థానిక వ్యవసాయ మార్కెట్ అధికారులకు సమాచారం ఇచ్చి రద్దు చేసుకోవచ్చు. ఈ విధానంలో రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ఉపయోగపడుతుంది.
జీరో వ్యాపారానికి చెక్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ మార్కెటింగ్ విధానం మూలంగా జీరో వ్యాపారానికి చెక్ పడుతుంది. వ్యవసాయ మార్కెట్లలో జీరో వ్యాపారం సైతం సాగుతున్నదనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా తీసుకున్న విధానంతో జీరో వ్యాపారానికి కూడా తెరపడుతుంది. జీరో వ్యాపారం మూలంగానే వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పడిపోతుందనే ఆరోపణలు ఉన్నందున ఈ విధానంలో చెక్‌పడనుంది.
ట్రయల్ రన్‌గా నామ్
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నామ్ విధానం ట్రయల్ రన్‌గా పరిమిత వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే చేపట్టారు. ఈ విధానం విజయవంతమవుతే మిగతా మార్కెట్లకు విస్తరిస్తారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు గాను మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుల వద్ద ఇన్‌గేట్లను నిర్మించాల్సి ఉంది. అంతే కాకుండా ధాన్యం నాణ్యతను పరిశీలించేందుకు కూడా తగిన సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. నామ్ విధానాన్ని అమలు చేస్తున్న వ్యవసాయ మార్కెట్లలో ముందస్తుగాానే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.