new approach
-
బ్యాంక్‌లు మారాలి.. లేదంటే మూత: కేవీ కామత్
ముంబై: బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని.. విధానాలు, పని నమూనాలను కాలానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలని వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయలేని బ్యాంక్‌లు వాటి దుకాణాలను మూతేసుకోవాల్సి వస్తుందని కొంత హెచ్చరికగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్‌లు నూతనతరం ఫిన్‌టెక్ కంపెనీలతో కలసి పనిచేయాలన్నారు. -
తత్కాల్ పాస్‌పోర్టులో కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్ : తత్కాల్ పాస్‌పోర్టులో కొత్త విధానం ప్రవేశపెట్టినట్లు పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ధృవీకరణ లేకుండానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆధార్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, రెండు గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు లభిస్తుందని అన్నారు. సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో 2017లో జారీ అయిన పాస్‌పోర్ట్ వివరాలను వెల్లడించారు. పాస్‌పోర్టులు జారీ చేయడంలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం మొదటి స్ధానంలో ఉందని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మెదక్, సిద్దిపేట, అదిలాబాద్‌లలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
ఆధార్‌కు భరోసా..!
న్యూఢిల్లీ: ఆధార్ వల్ల ప్రజల సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమవుతోందంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ– యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సమస్యను అధిగమించేందుకు ఆధార్ ధ్రువీకరణ కోసం కొత్త పద్ధతిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు బుధవారం ప్రకటించింది. నూతన విధానంలో ప్రజలెవరూ తమ 12 అంకెల ఒరిజినల్ ఆధార్ సంఖ్యను ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఆధార్ ఎక్కడ అవసరమైతే అక్కడ, దాని స్థానంలో తాత్కాలికంగా ఉండే ఒక వర్చువల్ గుర్తింపు సంఖ్యను మాత్రం ఇస్తే చాలని యూఐడీఏఐ పేర్కొంది. దీనివల్ల వినియోగదారుడి ఆధార్‌లో ఉన్న సమస్త సమాచారం వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కనిపించదనీ, కేవలం ఫొటో, పేరు వంటి నామమాత్రపు వివరాలు మాత్రమే అందేలా కొత్త విధానంలో పలు నియంత్రణలున్నాయని యూఐడీఏఐ ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది. ఎలా పనిచేస్తుంది? ముందుగా వినియోగదారులు యూఐడీఏఐ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌కు అనుసంధానిస్తూ 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ వినియోగదారుడికి కేటాయిస్తుంది. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ విభాగాలు ఎక్కడైనా సరే...ప్రజలు తమ ఆధార్ నంబర్‌కు బదులుగా ఈ వర్చువల్ నంబర్‌ను ఇచ్చి, గతంలో మాదిరిగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. వెంటనే వర్చువల్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న ఆధార్ నంబర్లోని సమాచారం వాణిజ్య సంస్థలు/ప్రభుత్వ విభాగాలకు చేరుతుంది. అయితే ఆధార్‌లోని పూర్తి వివరాలు కాకుండా పేరు, ఫొటో, చిరునామా వంటి నామమాత్రపు సమాచారం మాత్రమే వారికి అందుతుంది. ఆ వివరాలతో కేవైసీ (మీ వినియోగదారుల గురించి తెలుసుకోండి) ధ్రువీకరణను సంస్థలు పూర్తి చేసుకుంటాయి. ఈ వర్చువల్ నంబర్‌ను వినియోగదారులు ఎన్నింటినైనా సృష్టించుకోవచ్చు. ఒక్కో వర్చువల్ సంఖ్య నిర్దిష్ట కాలంపాటు లేదా కొత్త నంబర్‌ను సృష్టించుకునే వరకు యాక్టివ్‌గా ఉంటుంది. సంస్థలకు వినియోగదారుడి ఆధార్ నంబర్‌తో పనిలేదు. అది వారికి తెలియాల్సిన అవసరం ఉండదు. అలాగే పరిమిత సమాచారం మాత్రమే యూఐడీఏఐ నుంచి సంస్థలకు అందుతుంది కాబట్టి ఈ వ్యవస్థ భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ చెబుతోంది. వినియోగదారుడి తరఫున కంపెనీలు ఈ వర్చువల్ గుర్తింపు సంఖ్యను సృష్టించేందుకు కూడా అనుమతి ఉండదు. మార్చి నుంచి అమలు కొత్త విధానాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఆధార్ ధ్రువీకరణలన్నీ కొత్త విధానంలోనే జరుగుతాయని సర్క్యులర్‌లో పేర్కొంది. నిర్దేశిత సమయం తర్వాత కూడా ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకోని కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ‘ఆధార్ నంబర్ కలిగినవారు ధ్రువీకరణల కోసం ఆధార్ నంబర్‌కు బదులుగా వర్చువల్ గుర్తింపు సంఖ్యను వాణిజ్య సంస్థలకు ఇవ్వొచ్చు. గతంలో ఆధార్ నంబర్ చెప్పి వేలిముద్రలు ఎలా వేసేవారో ఇప్పుడు కూడా అలాగే ఈ తాత్కాలిక నంబర్ చెప్పి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది’ అని సర్క్యులర్‌లో యూఐడీఏఐ పేర్కొంది. ఆందోళనలు తగ్గించేందుకే ఆధార్ కార్డు కోసమంటూ ప్రజల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వేలిముద్రలు, ఐరిస్ సహా ఎంతో సున్నితమైన సమాచారాన్ని యూఐడీఏఐ సేకరిస్తోంది. అయితే ఈ సమాచారానికి రక్షణ కరువైందనీ, ఎవరికి పడితే వారికి ఆధార్ సమాచారం చాలా సులువుగా దొరుకుతోందని నిరూపించేలా పలు ఘటనలు జరిగాయి. ఈ నెల 3న ఆంగ్ల పత్రిక ‘ద ట్రిబ్యూన్’... రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారం కావాలన్నా దొరుకుతోందంటూ ఆధారాలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించడం, ఆ తర్వాత పత్రిక, ఆ వార్త రాసిన విలేకరిపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు, ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకే యూఐడీఏఐ కొత్త విధానం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత విధానంలో.. ♦ 12 అంకెల ఆధార్ సంఖ్యను వెల్లడించాలి ♦ వేలిముద్ర వేయాలి ♦ వాణిజ్య సంస్థల చేతికి ఆధార్‌లోని పూర్తి సమాచారం వెళ్తుంది ♦ ఒకటే ఆధార్ నంబర్ ఉంటుంది కొత్త విధానంలో.. ♦ 16 అంకెల వర్చువల్ సంఖ్యను వెల్లడించాలి హా వేలిముద్ర వేయాలి ♦ వాణిజ్య సంస్థలకు పేరు, ఫొటో, చిరునామాతో పరిమిత సమాచారమే వెళ్తుంది హా ఎన్ని తాత్కాలిక సంఖ్యలనైనా సృష్టించుకోవచ్చు. -
ధూమ్‘నామ్’..
♦ ధాన్యం కొనుగోళ్లలో కొత్త విధానం ♦ ఐదు వ్యవసాయ మార్కెట్లలో అమలు ♦ రైతన్నకు మేలు.. ‘జీరో’కు చెక్ ♦ గిట్టుబాటు ధరకు అవకాశం ♦ ఏ వ్యాపారైనా.. ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయవచ్చు జహీరాబాద్ : వ్యవసాయ మార్కెట్లలో జాతీయ మార్కెటింగ్ విధానం (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్.. నామ్) అమల్లోకి వచ్చింది. సోమవారం ఈ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ‘నామ్’ విధానం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు దోహద పడుతుంది. ఈ విధానాన్ని జిల్లాలోని జహీరాబాద్, సిద్దిపేట, సదాశివపేట, గజ్వేల్, జోగిపేట మార్కెట్ యార్డులలో అమలు పరుస్తున్నారు. ఈ విధానంలో దేశంలోని ఏ ప్రాంతంలోని లెసైన్స్ వ్యాపారి అయినా కొనుగోలు చేసుకోవచ్చు. మార్కెట్‌కు విక్రయం నిమిత్తం రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని ముందుగా గేటు వద్ద ఆన్లైన్లో పూర్తి వివరాలను ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతుకు లాట్ కోడ్ నెంబర్ ఇస్తారు. గేట్ ఎంట్రీ పాసును అందజేస్తారు. సదరు రైతు తీసుకువచ్చిన ధాన్యం పేరు, ఏయే ధాన్యం ఎన్ని బస్తాల్లో తీసుకువచ్చారు, సుమారు ఎంత తూకం ఉంటుందనే వివరాలను గేటు వద్దే న మోదు చేస్తారు. అనంతరం రైతు విక్రయించే కమిషన్ ఏజెంట్ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రైతు సరఫరా చేసే ధాన్యానికి సంబంధించిన పేరు, తండ్రి పేరు, గ్రామం, మొబాయిల్ నెంబరు, విక్రయించే కమిషన్ ఏజెంట్ పేరును నమోదు చేస్తారు. అంతే కాకుండా ఎలాంటి వాహనంలో ధాన్యం తీసుకువచ్చారనే వివరాలను కూడా లాట్ ప్రొఫార్మలో పొందు పరుస్తారు. వాహనం తిరిగి గేటు బయలకు వెళ్లే ముందు కూడా ఏమైన సరుకులను వాపసు తీసుకెళుతున్నదీ లేనిదీ నమోదు చేస్తారు. రైతులకు ఉపయోగకరం జాతీయ మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు లబ్ధిచేకూరుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారులకు అవకాశం ఉండదు. రైతులు మార్కెట్‌కు విక్రయం నిమిత్తం తీసుకువచ్చిన ధాన్యం నాణ్యతను నిర్ణయిస్తారు. తేమ శాతం, మట్టి శాతం ఏ మేరకు ఉందనేది ప్రత్యేక విభాగం ద్వారా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ధాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో ఉంచుతారు. అనంతరం ఆన్లైన్లో వ్యాపారులు తాము కొనుగోలు చేసే ధాన్యానికి సంబంధించి ధర నిర్ణయిస్తారు. రైతు అంగీకారం ఉంటేనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే రైతు స్థానిక వ్యవసాయ మార్కెట్ అధికారులకు సమాచారం ఇచ్చి రద్దు చేసుకోవచ్చు. ఈ విధానంలో రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ఉపయోగపడుతుంది. జీరో వ్యాపారానికి చెక్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ మార్కెటింగ్ విధానం మూలంగా జీరో వ్యాపారానికి చెక్ పడుతుంది. వ్యవసాయ మార్కెట్లలో జీరో వ్యాపారం సైతం సాగుతున్నదనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా తీసుకున్న విధానంతో జీరో వ్యాపారానికి కూడా తెరపడుతుంది. జీరో వ్యాపారం మూలంగానే వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పడిపోతుందనే ఆరోపణలు ఉన్నందున ఈ విధానంలో చెక్‌పడనుంది. ట్రయల్ రన్‌గా నామ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నామ్ విధానం ట్రయల్ రన్‌గా పరిమిత వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే చేపట్టారు. ఈ విధానం విజయవంతమవుతే మిగతా మార్కెట్లకు విస్తరిస్తారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు గాను మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుల వద్ద ఇన్గేట్లను నిర్మించాల్సి ఉంది. అంతే కాకుండా ధాన్యం నాణ్యతను పరిశీలించేందుకు కూడా తగిన సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. నామ్ విధానాన్ని అమలు చేస్తున్న వ్యవసాయ మార్కెట్లలో ముందస్తుగాానే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. -
రిజిస్ట్రేషన్ రోజే..
డిండి ప్రాజెక్టు భూసేకరణలో కొత్త విధానం రైతులతో స్వయంగా చర్చించిన మంత్రి జగదీశ్‌రెడ్డి డిండి మండలం సింగరాజుపల్లి, వీరబోయినపల్లి రైతులతో కలెక్టర్, జేసీల సమక్షంలోనే చర్చలు కనీసం ఎకరాకు రూ.5లక్షలివ్వాలని కోరిన రైతులు కాగ్ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని పరిహారంపై నిర్ణయం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణలో కొత్త విధానం అమల్లోకి రానుంది. గతంలో ఉన్న భూసేకరణ చట్టం స్థానే తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓనంబర్123 ప్రకారం భూసేకరణ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, జిల్లాలో గతంలో చేపట్టిన సా గునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిండి ప్రాజెక్టు భూసేకరణ విషయంలో చురుకుగా వ్యవహరించాలని, నిర్వాసితుల నుంచి భూమి ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించుకున్న రోజే రైతుల అకౌంట్లో నగదు జమ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం కలెక్టరేట్లో భూములు కోల్పోతున్న రైతులతో స్వయంగా చర్చించారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణల సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో కొత్త విధానం అమలు కాబోతున్న విధానాన్ని ఆయన డిండి మండలం సింగరాజుపల్లి, వీరబోయినపల్లి గ్రామాల నుంచి వచ్చిన 16 మంది రైతుల బృందానికి వివరించారు. మంత్రితో జరిపిన చర్చల అనంతరం రెండు గ్రామాల్లోని 600 ఎకరాల భూములను కూడా ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతు ప్రతినిధులు అంగీకారం తెలిపారని అధికార వర్గాలు తెలిపాయి. భూసేకరణ కాదు... భూ కొనుగోలే కొత్తగా అమలవుతున్న ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడం, నగదు కోర్టుల్లో డిపాజిట్ చేసి ఆ తర్వాత రైతులకు అందజేయడం లాంటి పద్ధతి కాకుండా నేరుగా రైతు అకౌంట్లోనే జమ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రైతులు సమ్మతి తెలియజేసిన 15 రోజుల్లోపు భూమిని రిజిస్టర్ చేయించుకోవాలని, రిజిస్టర్ చేయించుకున్న రోజే రైతుల అకౌంట్లో నగదు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి పట్టాలు లేకపోయినా పారదర్శక విచారణ జరిపి వారిని కూడా నిర్వాసితులుగా గుర్తించాలని నిర్ణయించారు. అదేవిధంగా రైతుల భూములతో పాటు భూముల్లో ఉన్న బోర్లు, బావులు, పైపులైన్లు, చెట్లు, తోటలకు కూడా అదనపు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. కనీసం రూ.5లక్షలివ్వండి అయితే, సమావేశానికి రైతులు తమకు కనీసం ఎకరానికి రూ.5లక్షలు పరిహారంగా చెల్లించాలని మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి డిండి ప్రాజెక్టు నిర్మాణానికి సామాజిక ప్రయోజనం కింద రైతులు సహకరిస్తే ఎంతైనా పరిహారం చెల్లించ డానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని వెల్లడించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే కాగ్ నిబంధనలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, కేంద్రమే ఈ ఆడిట్ నిర్వహిస్తుంది కనుక నిబంధనలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. గుట్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న భూములకు మార్కెట్ ధర కన్నా తక్కువగా చెల్లించి సేకరిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రైతుల దృష్టికి తీసుకువచ్చారు. డిండి ప్రాజెక్టు భూములకు కనీసం రూ.4.15లక్షలిస్తామని, అదనపు చెల్లింపుల గురించి రెవెన్యూ యంత్రాంగం నిర్ణయిస్తుందని మంత్రి వెల్లడించినట్టు సమాచారం. అయితే, పులిచింతల, ఏఎమార్పీ, ఏకేబీఆర్ నిర్వాసితుల్లా కాకుండా డిండి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు సత్వర న్యాయం చేస్తామని మంత్రి రైతులకు వివరించారు. భూమి తీసుకున్న రోజు రూ.4లక్షలు ఎకరానికి చెల్లిస్తామని చెప్పి, కోర్టుల చుట్టూ తిప్పి పదేళ్ల తర్వాత రూ.4లక్షలిస్తే రైతులకు ప్రయోజనమేమీ ఉండదని, సత్వరమే సమస్యను పరిష్కరించడం ద్వారానే రైతుకు ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతోనే కొత్త విధానం ప్రకారం భూసేకరణ చేస్తామని మంత్రి రైతులకు వివరించారు. రైతులంతా సహకరిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరిస్తామని ఈ సందర్భంగా మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో మునుగోడు, భువనగిరి ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. -
కిక్కు.. లక్కు
కొవ్వూరు : మద్యం అమ్మకాలపై కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తూచ్ అనేసింది. పాత విధానంలోనే మద్యం దుకాణాల లెసైన్సులు కేటాయించాలని నిర్ణయించింది. లెసైన్సు ఫీజులు పెంచి దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానం పలి కింది. దుకాణాలను దక్కించుకునేందుకు మద్యం సిండికేట్లు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తు తం తమ చేతుల్లోనే ఉన్న దుకాణాలు ఇతరులకు దక్కకుండా చూసేందుకు పథకాలు పన్నుతున్నారు. ఒక్కొక్క దుకాణానికి సగటున 10కి తగ్గకుండా బినామీలతో దరఖాస్తులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాన దుకాణాలకు అనుబంధంగా బెల్టు షాపులు నిర్వహించడాన్ని నిషేధించినా, వ్యాపారాన్ని లాభసాటిగా మలుచుకోవడంలో మెళకువలు నేర్చుకున్న సిండికేట్ పెద్దలు అధిక మొత్తంలో దుకాణాలను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నా రు. అధికార పార్టీ నేతలు వీటిపై కన్నేశారు. ఎక్కడెక్కడ మద్యం విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి.. ఏ షాపులు లాభదాయకంగా ఉంటాయన్న దాని పై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వీటికి ఇతరులు పోటీకి రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు. ఒకవేళ లాటరీ విధానంలో దుకాణాలు తమకు దక్కకపోతే ఎదుటివారికి ఎంతోకొంత ముట్టజెప్పి వాటిని చేజిక్కించుకునేందుకు సిండికేట్ పెద్దలు పథకాలు పన్నుతున్నారు. జిల్లాలో నాలుగు స్లాబ్లే జనాభా ప్రాతిపదికన మద్యం షాపుల కేటారుుంపును ఐదు స్లాబ్‌లుగా విభజించినప్పటికి జిల్లాలో నాలుగు స్లాబులు మాత్రమే అమలు కానున్నాయి. దరఖాస్తులను స్వీకరించిన అనంతరం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనుండటంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది. 475 దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లాల్లో 473 మద్యం దుకాణాలతోపాటు రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు మద్యం దుకాణాలను కలుపుకుని మొత్తం 475 దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం షాపుల లీజు గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్త లెసైన్సుదారులు రానున్నారు. నూతన విధానంపై ఏలూరులో మంగళవారం ఎక్సైజ్ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణలో బిజీ అయ్యారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులను ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందించాలి. 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీసి అదేరోజు దుకాణాల లెసైన్సులు మంజూరు చేస్తారు. లెసైన్సు ఫీజుల నిర్ధారణలో తిరకాసు జనాభా ప్రాతిపదికన లెసైన్సు ఫీజు నిర్ధారించినప్పటికీ పట్టణం లేదా నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నిటికీ ఒకే తరహా ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో లెసైన్సు ఫీజు పట్టణ స్థారుులో చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఉదాహరణకు కొవ్వూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఊనగట్లలో 5వేల లోపు మాత్రమే జనాభా ఉన్నారు. ఈ ప్రకారం ఇక్కడ లెసైన్సు ఫీజు రూ.32.50 లక్షలు ఉండాలి. అయితే, దీనికి పక్కనే ఐదు కిలో మీటర్లలోపు దూరంలో ఉన్న చాగల్లులో స్లాబ్ ధరలను ఇక్కడ అమలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ లెసైన్సు ఫీజు రూ.36 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. తిమ్మరాజుపాలెం, బ్రాహ్మణగూడెం, సమిశ్రగూడెంలోని రెండు దుకాణాలకు నిడదవోలు పట్టణంలో విధించే స్లాబ్ ఫీజులను వర్తింపచేస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అదే పరిస్థితి. వేములూరు, వాడపల్లి షాపులకు రాజ మండ్రి నగరపాలక సంస్థ పరిధిలో అమలులో ఉన్న స్లాబ్ ధరలను వర్తింపచేస్తున్నారు. కొవ్వూరులోనూ రాజమండ్రి స్లాబ్‌లను అమలు చేస్తుం డగా.. కొవ్వూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామాలకు ఇదే స్లాబ్‌ను వర్తింపచేస్తున్నారు. దీంతో ఈ రెండు దుకాణాల్లో ఏకంగా రూ.50 లక్షల చొప్పున లెసైన్సు ఫీజు చెల్లిం చాల్సి వస్తోంది. వాస్తవంగా ఈ రెండు గ్రామాల్లో జనాభా 5వేల లోపు మాత్రమే. ఇక్కడ రూ.32.50 లక్షలు స్ల్లాబ్ అమలు చేయాలి. కార్పొరేషన్‌కు, మునిసిపాలిటీకి ఐదు కిలో మీట ర్ల పరిధిలో ఉండటంతో ఇక్కడ ఒక్కో షాపునకు రూ.17.50 లక్షల చొప్పున అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఏలూరు నగరం సమీపంలోని గ్రామాల్లో దుకాణాలకు ఇదే విధమైన ఇబ్బంది ఉంది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోనూ లెసైన్సు ఫీజులు పట్టణ స్లాబ్‌లను అమలు చేస్తున్నారు. దరఖాస్తు చేయడం ఇలా ఒక్కొక్క దుకాణం లెసైన్సు అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.25 వేలు చలానా రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ములు దరఖాస్తుదారుడికి తిరిగి చెల్లించరు. లెసైన్సు ఫీజు నిమిత్తం నిర్ధేశించిన స్లాబ్ సొమ్ములో పది శాతం సొమ్మును డీడీ తీసి అప్లికేషన్‌కు జతపర్చాలి. ఒకవేళ దుకాణదారునికి షాపు దక్కపోతే డీడీ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తుదారుడు ఏ-1, ఏ-3 ఫారాలను నింపి రూ.100 స్టాంప్‌పై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చట్టాలను అనుసరించి షాపును నిర్వహిస్తానని, నిబంధనలకు కట్టుబడి ఉంటానని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ-2 ఫారం నింపి దరఖాస్తుదారునికి సంబంధించిన ఆస్తుల వివరాలను తెలియజేసే ఆఫిడవిట్‌ను రూ.100 స్టాంప్‌పై నోటరీ చేయించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఇవన్నీ అందజేసిన వారికి టెండర్ల సమయంలో కేంద్రం లోపలికి ప్రవేశించేందుకు ఎంట్రీ పాస్‌ను అందిస్తారు. ఎవరైతే దరఖాస్తుదారుడో అతనే టెండరు సమయంలో లోనికి వెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తుదారునికి బదులు ఇతరులు ఎవరైనా టెండరు కేంద్రంలోకి ప్రవేశిస్తే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. దుకాణం దక్కించుకున్న వ్యక్తి ముందుగా చెల్లించిన 10 శాతం సొమ్మును మినహాయించి షాపు లెసైన్సు ఫీజులో మూడోవంతు ఫీజును చెల్లించాలి.