న్యూఢిల్లీ: ఆధార్ వల్ల ప్రజల సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమవుతోందంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ– యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సమస్యను అధిగమించేందుకు ఆధార్ ధ్రువీకరణ కోసం కొత్త పద్ధతిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు బుధవారం ప్రకటించింది.
నూతన విధానంలో ప్రజలెవరూ తమ 12 అంకెల ఒరిజినల్ ఆధార్ సంఖ్యను ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఆధార్ ఎక్కడ అవసరమైతే అక్కడ, దాని స్థానంలో తాత్కాలికంగా ఉండే ఒక వర్చువల్ గుర్తింపు సంఖ్యను మాత్రం ఇస్తే చాలని యూఐడీఏఐ పేర్కొంది. దీనివల్ల వినియోగదారుడి ఆధార్‌లో ఉన్న సమస్త సమాచారం వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కనిపించదనీ, కేవలం ఫొటో, పేరు వంటి నామమాత్రపు వివరాలు మాత్రమే అందేలా కొత్త విధానంలో పలు నియంత్రణలున్నాయని యూఐడీఏఐ ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది.
ఎలా పనిచేస్తుంది?
ముందుగా వినియోగదారులు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌కు అనుసంధానిస్తూ 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ వినియోగదారుడికి కేటాయిస్తుంది. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ విభాగాలు ఎక్కడైనా సరే...ప్రజలు తమ ఆధార్ నంబర్‌కు బదులుగా ఈ వర్చువల్ నంబర్‌ను ఇచ్చి, గతంలో మాదిరిగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. వెంటనే వర్చువల్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న ఆధార్ నంబర్‌లోని సమాచారం వాణిజ్య సంస్థలు/ప్రభుత్వ విభాగాలకు చేరుతుంది.
అయితే ఆధార్‌లోని పూర్తి వివరాలు కాకుండా పేరు, ఫొటో, చిరునామా వంటి నామమాత్రపు సమాచారం మాత్రమే వారికి అందుతుంది. ఆ వివరాలతో కేవైసీ (మీ వినియోగదారుల గురించి తెలుసుకోండి) ధ్రువీకరణను సంస్థలు పూర్తి చేసుకుంటాయి. ఈ వర్చువల్ నంబర్‌ను వినియోగదారులు ఎన్నింటినైనా సృష్టించుకోవచ్చు. ఒక్కో వర్చువల్ సంఖ్య నిర్దిష్ట కాలంపాటు లేదా కొత్త నంబర్‌ను సృష్టించుకునే వరకు యాక్టివ్‌గా ఉంటుంది.
సంస్థలకు వినియోగదారుడి ఆధార్ నంబర్‌తో పనిలేదు. అది వారికి తెలియాల్సిన అవసరం ఉండదు. అలాగే పరిమిత సమాచారం మాత్రమే యూఐడీఏఐ నుంచి సంస్థలకు అందుతుంది కాబట్టి ఈ వ్యవస్థ భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ చెబుతోంది. వినియోగదారుడి తరఫున కంపెనీలు ఈ వర్చువల్ గుర్తింపు సంఖ్యను సృష్టించేందుకు కూడా అనుమతి ఉండదు.
మార్చి నుంచి అమలు
కొత్త విధానాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఆధార్ ధ్రువీకరణలన్నీ కొత్త విధానంలోనే జరుగుతాయని సర్క్యులర్‌లో పేర్కొంది. నిర్దేశిత సమయం తర్వాత కూడా ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకోని కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
‘ఆధార్ నంబర్ కలిగినవారు ధ్రువీకరణల కోసం ఆధార్ నంబర్‌కు బదులుగా వర్చువల్ గుర్తింపు సంఖ్యను వాణిజ్య సంస్థలకు ఇవ్వొచ్చు. గతంలో ఆధార్ నంబర్ చెప్పి వేలిముద్రలు ఎలా వేసేవారో ఇప్పుడు కూడా అలాగే ఈ తాత్కాలిక నంబర్ చెప్పి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది’ అని సర్క్యులర్‌లో యూఐడీఏఐ పేర్కొంది.
ఆందోళనలు తగ్గించేందుకే
ఆధార్ కార్డు కోసమంటూ ప్రజల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వేలిముద్రలు, ఐరిస్ సహా ఎంతో సున్నితమైన సమాచారాన్ని యూఐడీఏఐ సేకరిస్తోంది. అయితే ఈ సమాచారానికి రక్షణ కరువైందనీ, ఎవరికి పడితే వారికి ఆధార్ సమాచారం చాలా సులువుగా దొరుకుతోందని నిరూపించేలా పలు ఘటనలు జరిగాయి.
ఈ నెల 3న ఆంగ్ల పత్రిక ‘ద ట్రిబ్యూన్’... రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారం కావాలన్నా దొరుకుతోందంటూ ఆధారాలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించడం, ఆ తర్వాత పత్రిక, ఆ వార్త రాసిన విలేకరిపై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు, ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకే యూఐడీఏఐ కొత్త విధానం ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత విధానంలో..
♦ 12 అంకెల ఆధార్ సంఖ్యను వెల్లడించాలి
♦ వేలిముద్ర వేయాలి
♦ వాణిజ్య సంస్థల చేతికి ఆధార్‌లోని పూర్తి సమాచారం వెళ్తుంది
♦ ఒకటే ఆధార్ నంబర్ ఉంటుంది
కొత్త విధానంలో..
♦ 16 అంకెల వర్చువల్ సంఖ్యను వెల్లడించాలి హా వేలిముద్ర వేయాలి
♦ వాణిజ్య సంస్థలకు పేరు, ఫొటో, చిరునామాతో పరిమిత సమాచారమే వెళ్తుంది హా ఎన్ని తాత్కాలిక సంఖ్యలనైనా సృష్టించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment