డిండి ప్రాజెక్టు భూసేకరణలో కొత్త విధానం
రైతులతో స్వయంగా చర్చించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
డిండి మండలం సింగరాజుపల్లి, వీరబోయినపల్లి
రైతులతో కలెక్టర్, జేసీల సమక్షంలోనే చర్చలు
కనీసం ఎకరాకు రూ.5లక్షలివ్వాలని కోరిన రైతులు
కాగ్ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని పరిహారంపై నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణలో కొత్త విధానం అమల్లోకి రానుంది. గతంలో ఉన్న భూసేకరణ చట్టం స్థానే తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓనంబర్123 ప్రకారం భూసేకరణ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, జిల్లాలో గతంలో చేపట్టిన సా గునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిండి ప్రాజెక్టు భూసేకరణ విషయంలో చురుకుగా వ్యవహరించాలని, నిర్వాసితుల నుంచి భూమి ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించుకున్న రోజే రైతుల అకౌంట్‌లో నగదు జమ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం కలెక్టరేట్‌లో భూములు కోల్పోతున్న రైతులతో స్వయంగా చర్చించారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణల సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో కొత్త విధానం అమలు కాబోతున్న విధానాన్ని ఆయన డిండి మండలం సింగరాజుపల్లి, వీరబోయినపల్లి గ్రామాల నుంచి వచ్చిన 16 మంది రైతుల బృందానికి వివరించారు. మంత్రితో జరిపిన చర్చల అనంతరం రెండు గ్రామాల్లోని 600 ఎకరాల భూములను కూడా ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతు ప్రతినిధులు అంగీకారం తెలిపారని అధికార వర్గాలు తెలిపాయి.
భూసేకరణ కాదు... భూ కొనుగోలే
కొత్తగా అమలవుతున్న ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడం, నగదు కోర్టుల్లో డిపాజిట్ చేసి ఆ తర్వాత రైతులకు అందజేయడం లాంటి పద్ధతి కాకుండా నేరుగా రైతు అకౌంట్‌లోనే జమ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రైతులు సమ్మతి తెలియజేసిన 15 రోజుల్లోపు భూమిని రిజిస్టర్ చేయించుకోవాలని, రిజిస్టర్ చేయించుకున్న రోజే రైతుల అకౌంట్‌లో నగదు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి పట్టాలు లేకపోయినా పారదర్శక విచారణ జరిపి వారిని కూడా నిర్వాసితులుగా గుర్తించాలని నిర్ణయించారు. అదేవిధంగా రైతుల భూములతో పాటు భూముల్లో ఉన్న బోర్లు, బావులు, పైపులైన్లు, చెట్లు, తోటలకు కూడా అదనపు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.
కనీసం రూ.5లక్షలివ్వండి
అయితే, సమావేశానికి రైతులు తమకు కనీసం ఎకరానికి రూ.5లక్షలు పరిహారంగా చెల్లించాలని మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి డిండి ప్రాజెక్టు నిర్మాణానికి సామాజిక ప్రయోజనం కింద రైతులు సహకరిస్తే ఎంతైనా పరిహారం చెల్లించ డానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని వెల్లడించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే కాగ్ నిబంధనలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, కేంద్రమే ఈ ఆడిట్ నిర్వహిస్తుంది కనుక నిబంధనలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. గుట్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న భూములకు మార్కెట్ ధర కన్నా తక్కువగా చెల్లించి సేకరిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రైతుల దృష్టికి తీసుకువచ్చారు.
డిండి ప్రాజెక్టు భూములకు కనీసం రూ.4.15లక్షలిస్తామని, అదనపు చెల్లింపుల గురించి రెవెన్యూ యంత్రాంగం నిర్ణయిస్తుందని మంత్రి వెల్లడించినట్టు సమాచారం. అయితే, పులిచింతల, ఏఎమార్పీ, ఏకేబీఆర్ నిర్వాసితుల్లా కాకుండా డిండి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు సత్వర న్యాయం చేస్తామని మంత్రి రైతులకు వివరించారు. భూమి తీసుకున్న రోజు రూ.4లక్షలు ఎకరానికి చెల్లిస్తామని చెప్పి, కోర్టుల చుట్టూ తిప్పి పదేళ్ల తర్వాత రూ.4లక్షలిస్తే రైతులకు ప్రయోజనమేమీ ఉండదని, సత్వరమే సమస్యను పరిష్కరించడం ద్వారానే రైతుకు ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతోనే కొత్త విధానం ప్రకారం భూసేకరణ చేస్తామని మంత్రి రైతులకు వివరించారు. రైతులంతా సహకరిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరిస్తామని ఈ సందర్భంగా మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో మునుగోడు, భువనగిరి ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డిలు కూడా ఉన్నారు.
రిజిస్ట్రేషన్ రోజే..
Published Sat, Sep 26 2015 2:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement