ప్రమాణ స్వీకారం ఎప్పుడో? | achampet Agricultural Market Committee | Sakshi
Sakshi News home page

ప్రమాణ స్వీకారం ఎప్పుడో?

Published Wed, Oct 19 2016 12:34 PM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

achampet Agricultural Market Committee

40 రోజుల క్రితమే మార్కెట్‌ కమిటీ కార్యవర్గం ఎంపిక
రెండుసార్లు వాయిదా పడిన కార్యక్రమం
అధికార పార్టీ నాయకుల్లో నైరాశ్యం
 
అచ్చంపేట : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఏర్పాటుచేసి 40రోజులవుతున్నా ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరగలేదు. వాస్తవానికి గత నెల 7న అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పోశం జయంతి గణేష్‌ను నియమించినట్టు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట అదే నెల 14న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనా వర్షం కారణంగా వాయిదా పడింది. తిరిగి ఈనెల7న ప్రమాణ స్వీకారం జరుగుతుందని అందరూ భావించారు. అయితే రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు జ్వరం రావడంతో రెండోసారి వాయిదా వేశారు. దీంతో అధికార పార్టీ నేతల్లో నైరాశ్యం చోటు చేసుకుంది. 
 
రిజర్వేషన్లో  బీసీ మహిళకు అవకాశం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లతో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈ పదవిపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎమెల్యే గువ్వల బాలరాజు అమ్రాబాద్‌ మండలం మాధవానిపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పోశం గణేష్‌ భార్య జయంతికి అవకాశం కల్పించారు. ఇక వైస్‌చైర్మన్‌ పదవి బల్మూర్‌ మండలం రామాజీపల్లికి చెందిన మల్లిరెడ్డి Ðð ంకట్‌రెడ్డిని వరించింది. వీరితోపాటు డైరెక్టర్లుగా అచ్చంపేటకు చెందిన గాలిముడి రత్నమ్మ, ఎం.డి.అమీనొద్దీన్, ఉప్పునుంతల మండలం మర్రిపల్లి మాజీ సర్పంచ్‌ బాలీశ్వరయ్య, వెల్టూర్‌ మాజీ సర్పంచ్‌ లింగం, అమ్రాబాద్‌కు చెందిన రాజలింగం, లింగాలకు చెందిన వెంకటగిరి ఎంపికయ్యారు.
 
అనుచరులకు సముచిత స్థానం 
పోశం జయంతీగణెష్‌ అమ్రాబాద్‌ జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడిగా ఉన్న గణేష్‌కు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆమెకు ఇటీవల మార్కెట్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. అమ్రాబాద్‌ మండలానికి ఈ పదవి దక్కడం ఇదే మొదటిసారి. ఇక వైస్‌ చైర్మన్‌ ఎం.వెంకట్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి పనిచేస్తూ గువ్వల అనుచరునిగా ఉన్నారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీకాలం ఏడాది మాత్రమే ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 40రోజులు గడిచిపోవడంతో ఈ పదవిలో పదిన్నర నెలలు మాత్రమే కొనసాగుతారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లుగడిచిపోయింది. ప్రభుత్వం సకాలంలో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసి ఉంటే ఇప్పటి వరకు ముగ్గురు చైర్మన్లు ఎంపికయ్యేవారు. పదవులు ఆశిస్తున్న వారిలో ఒకింత నిరాశే మిగిలింది.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement