మార్కెట్‌యార్డుల్లో ‘ఈ– నామ్’
మార్కెట్‌యార్డుల్లో ‘ఈ– నామ్’
Published Wed, Sep 28 2016 8:08 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
* రాష్ట్రంలో తొలి దశగా 12 యార్డుల్లో అమలు
* ఇప్పటికే గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో వ్యాపారం
* అక్టోబర్‌లో తెనాలి యార్డులో ఈ– నామ్ ప్రారంభానికి చర్యలు
తెనాలి టౌన్: దేశ వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌యార్డులలో ఆన్‌లైన్ ట్రేడింగ్, ఈ– నామ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా 585 మార్కెట్ యార్డులలో ఈ–నామ్ సిస్టమ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌లో 12 మార్కెట్ యార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో గుంటూరు జిల్లాలో తెనాలి, పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, గోపాలపురం, అనంతపురం జిల్లాలో ప్రత్తికొండ, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పొదలకూరు, కలికిరి, గుర్రంకొండ, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు యార్డులు ఉన్నాయి. ఈ యార్డులో ఈ– నామ్ సిస్టమ్‌ను అమలు చేసేందుకు ప్రతి యార్డుకు రూ.30 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ఇప్పటికే జిల్లాలో గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో ఆన్‌లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ద్వారా మిర్చి, పసుపు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌యార్డులలో వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకునే వారు. రైతుకు లాభం చేకూర్చాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ ట్రేడింగ్, ఈ– నామ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మార్కెటింగ్ శాఖాధికారులు తెలిపారు. ఈ వ్యవస్థలో సీక్రెట్ టెండర్‌లు ఉంటాయని, దీని ద్వారా ఎక్కువ రేటు వస్తుందని అంటున్నారు. రైతు ఒప్పుకుంటే వ్యవసాయ ఉత్పత్తులను కాటా వేసి నగదు వెంటనే చెల్లిస్తామని చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే 22 మార్కెట్ యార్డుల్లో ఆన్‌లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పారు.
అక్టోబర్‌ను నుంచి తెనాలిలో..
తెనాలిలో ఈ– నామ్ వ్యవస్థను అక్టోబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దీని గురించి రైతులు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి యార్డులో ఎనిమిది ఆన్‌లైన్ సిస్టమ్ క్యాబిన్‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) కంపెనీ దేశ వ్యాప్తంగా ఈ– నామ్ వ్యవస్థను ప్రవేశపెట్టే మార్కెట్ యార్డులకు సాఫ్ట్‌వేర్ సరఫరా చేయనున్నట్లు ఎన్‌ఎఫ్‌సీఎల్ మార్కెటింగ్ ప్రతినిధి స్వామి తెలిపారు. ప్రాజెక్టు రూపకల్పన చేసిన అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాపారులకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చిన అనంతరం దీనిపై అవగాహన కల్పించి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే విధానంపై శిక్షణ ప్రారంభిస్తారు. ఈ విధానం పూర్తిగా అమలైతే రైతుకు కొంత మేరకు లాభం చేకూరే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement