నామిలేటెడ్..!
♦ మార్కెట్ కమిటీల నియామకం ఇంకెప్పుడో..?
♦ ఖమ్మంలో పరిశీలనతోనే సరి, కోర్టు పరిధిలో ‘ఏజెన్సీ’
♦ ప్రతిపాదనలే లేని 5 కమిటీలు, తప్పని ఎదురుచూపులు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో ఏడు ఏజెన్సీలో, మిగతావి మైదాన ప్రాంతంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క మార్కెట్‌కు కూడా కమిటీని నియమించలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా..ఇంకా ఆచరణకు నోచకపోవడంతో ఆశావహులో నిరాశ నెలకొంది. ఈసారి అధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఉపాధ్యక్షులు, మిగిలిన సభ్యుల పదవులకు రిజర్వేషన్ ఉండదు.
ప్రక్రియే మొదలు కాలే..
జిల్లాలోని మైదాన ప్రాంతంలో ఆరు మార్కెట్ కమిటీల్లో కేవలం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. మిగతా సత్తుపల్లి, వైరా, కల్లూరు, నేలకొండపల్లి, మధిర మార్కెట్లకు సంబంధించి ప్రక్రియనే మొదలు కాలేదు. ప్రతిపాదనలు అందితే..రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వారు పరిశీలించి, ఆ పదవులను అలంకరించే వారు అర్హులా..? కాదా..? నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పంపిస్తారు. కమిటీ సభ్యులు మార్కెట్ పరిధిలోని వారేనా..? అనే విషయాలను రెవెన్యూ శాఖ ద్వారా ధ్రువీకరించుకుంటారు. తుది జాబితా పేర్లను ప్రభుత్వానికి పంపుతారు. ఖమ్మం మినహా మిగతా మార్కెట్లలో ఈ ప్రక్రియకు శ్రీకారమే చుట్టలేదు.
ఏజెన్సీలో ‘ఏడు’పే..
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏడు మార్కెట్లు ఉండగా..కోర్టు పరిధిలో వ్యవహారం ఉండడంతో వీటికి నామినేటెడ్ పదవుల నియామకం నిర్వహించే అవకాశం లేదు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, ఏన్కూరు, చర్ల, దమ్మపేట మార్కెట్లకు నామినేటెడ్ యోగ్యం లేదు. ఇక్కడి కమిటీలన్నీ తమకే కేటాయించాలని గిరిజనులు కోర్టును ఆశ్రయించడంతో నియామకం నిలిచి పదేళ్లు దాటుతోంది.
జాప్యంతో నైరాశ్యం..
వ్యవసాయ కమిటీ అధ్యక్షులను నామినేటెడ్ పద్ధతిలో నియమించే విషయంలో నెలకొన్న తీవ్ర జాప్యంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం కూడా ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం విషయంలో శ్రద్ధ చూపడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల కోసం స్థానికంగా వర్గపోరు కూడా కొనసాగుతోంది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితన్నీరు హరీష్‌రావుల చేతుల్లోనే ఈ పదవుల నియామకం ఉందని, వారు సూచించిన వారికే పీఠం దక్కుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.