‘విలీనం’తో పెరుగుతున్న తూర్పు ఏజెన్సీ విస్తీర్ణం
జిల్లాలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పరిణామం
రంపచోడవరం : ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఎక్కువ శాతం భూభాగాన్ని కలిగి ఉంది. ‘విభజన’ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను తూర్పు గోదావరిలో విలీనం చేయడంతో ఏజెన్సీ భూభాగ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రంపచోడవరం డివిజన్‌లో ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలు చేరాయి.
ఇదీ స్వరూపం
రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాలున్నాయి. వీటిలో దాదాపు 600 గ్రామాలు ఉన్నాయి. కొత్తగా ఖమ్మం జిల్లాలోని కూనవరం, చింతూరు, వీఆర్ పురం, భద్రాచలం రూరల్ ప్రాంతాలను తూర్పు ఏజెన్సీలో విలీనం చేశారు. ఈ మండలాల్లో 277 గ్రామాలు ఉన్నాయి. వీటిలో జనాభా 1,99,825 ఉంది. తూర్పు ఏజెన్సీలో 1,50,024 హెక్టార్ల అటవీ ప్రాంతం కలిసింది. దీంతో జిల్లాలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా తూర్పు ఏజెన్సీ పరిణమించింది.
వరదలొస్తే..!?
పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న ఈ నాలుగు మండలాలు గోదావరి వరదల సమయంలో పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మండలాల్లో పూర్తిగా అభివృద్ధి పనులను నిలిపివేసింది. గతంలో వరదలొస్తే భద్రాచలం ఐటీడీఏ అధికారులు పునరావాస చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం తూర్పు ఏజెన్సీలో విలీనం చేయడంతో.. విపత్కర పరిస్థితుల్లో రంపచోడవరం ఐటీడీఏ అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి. దేవీపట్నం మండలంలో వరదల సమయంలోనే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏజెన్సీలో అనేక గ్రామాల్లో అధికారుల పర్యటనలు కూడా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా చేరిన మండలాల్లో సమర్థ పరిపాలన అందుబాటులోకి రావడం ప్రశ్నార్థకమే.
పునరావాసం ఎక్కడ ?
ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను తూ ర్పు ఏజెన్సీలో కలిపిన ప్రభుత్వం పోలవరం ముంపు కారణంగా గ్రామాలు విడిచిపెట్టే వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెలఖరున అధికారికంగా తూర్పు ఏజెన్సీలో విలీనం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా కూనవరం మండలంలో 48 గ్రామాలు, చింతూరు మండలంలో 17, వీఆర్ పురం మండలంలో 45, భద్రాచలం రూ రల్‌లో 13 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల వారికి ఏ స్థాయిలో పునరావాస చర్యలు చేపడతారో అర ్ధంకాని పరి స్థితి నెలకొంది. తూర్పు ఏజెన్సీలో కలిసిన ముంపు గ్రామాల వారికి చింతూరు-మారేడుమిల్లి ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి.
పరిపాలనాంశాలు చూడాలన్నారు
తూర్పు ఏజెన్సీలో కలిసిన నాలుగు మండలాలకు సంబంధించి పరిపాలనపరమైన అవసరాలు చూడాలని ఆదేశించారు. గెజిట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అప్పటివరకు అక్కడి వారికి సంబంధించిన అవసరాలకు రంపచోడవరం అధికారులను సంప్రదించాల్సి ఉంది. - డాక్టర్ బి.శంకర వరప్రసాద్, ఆర్డీఓ, రంపచోడవరం
విశాల మన్యం
Published Sun, Jul 20 2014 11:47 PM | Last Updated on Wed, Apr 3 2019 9:29 PM
Advertisement
Advertisement