దళారీ వ్యవస్థకు మంగళం!
⇒ రాష్ట్ర కొత్త మార్కెటింగ్ చట్టంలో కీలక అంశాలు
⇒ నల్సార్ వర్సిటీ ద్వారా ముసాయిదా బిల్లు సిద్ధం
⇒ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులను పీల్చి పిప్పి చేస్తున్న దళారీ వ్యవస్థకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతుల పంటలకు తగిన ధర దక్కేలా, మార్కెట్లో వివిధ రకాల దోపిడీలకు చెక్ పెట్టేలా కొత్త మార్కెటింగ్ చట్టాన్ని రూపొం దిస్తోంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో రూపుదిద్దిన కొత్త చట్టంలోని అం శాలపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికా రులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తుది మెరు గులతో ముసాయిదా బిల్లు తయారు చేసి, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టను న్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త చట్టం ప్రకారమే మార్కెట్లో కార్యకలా పాలు జరిగేలా చూడాలని నిర్ణ యించారు.
మార్కెట్ రుసుము నుంచి రైతులకు విముక్తి
ఇప్పటివరకు మార్కెట్లో వివిధ రకాల రుసుములన్నీ రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కొత్త చట్టంతో దీనికి చరమగీతం పాడనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చే వరకు అయ్యే ఖర్చులనే భరిస్తారు. మార్కెట్లోకి ప్రవేశించాక ఎటువంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం ఉండకుండా కొత్త చట్టం అవకాశం కల్పిస్తుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం రైతుల నుంచే కమీషన్ వసూలు చేస్తున్నారు. కొత్త చట్టంతో దీన్ని రద్దు చేస్తారు.
వ్యాపారులే కమీషన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో అమల్లో ఉన్న తరహాలో రివాల్వింగ్ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించనప్పుడు ఈ రివాల్వింగ్ ఫండ్ రైతులకు చేయూతనిస్తుంది. అలాగే కేంద్ర మార్కెట్ ఫండ్‌కు బదులుగా రాష్ట్ర మార్కెట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ యార్డుల్లోనూ, చెక్‌పోస్టుల వద్ద రైతులు తీసుకొచ్చే పండ్లు, కూరగాయలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుమును కూడా రద్దు చేస్తారు.