మార్కెట్‌యార్డులో కేసు నమోదు చేసిన దుకాణం
– మార్కెట్ యార్డులో వెలుగు చూసిన కొత్త మోసం
– ఆందోళనకు దిగిన రైతులు
– కార్యదర్శి చొరవతో బాధిత రైతులకు పరిహారం
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): మార్కెట్‌యార్డు కేంద్రంలో వ్యాపారులు రైతులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారు. గురువారం కొందరు రైతులు గమనించి ఆందోళనకు దిగడంతో మార్కెట్ కార్యదర్శి జోక్యం చేసుకుని దుకాణంపై కేసు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. పూర్తి వివరాలు.. ఆలూరు మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన జగదీష్, మల్లేష్‌తో పాటు మరో పది మంది రైతులు వామును కర్నూలు మార్కెట్‌యార్డుకు గురువారం తీసుకొచ్చారు. ఉదయం నుంచి వారు వేచి ఉండి మార్కెట్‌యార్డులోని ఉమామహేశ్వర ట్రేడర్స్ (షాపు నెం.40బి)లో విక్రయించారు. తొలుత సుమారు 15 బస్తాలను కాటా వేసిన వ్యాపారులు ఆఖరి బస్తాలో 22 కేజీల వాము ఉండగా, 15 కేజీలే ఉన్నట్లు రసీదులు ఇవ్వడంతో రైతులు అవాక్కయ్యారు. తాము తెచ్చింది 22 కేజీలు అయితే, 15 కేజీలు ఎలా వస్తాయని వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే మరికొంతమంది రైతులు తమకు కూడా ఇదే తరహా మోసం జరిగిందనీ, న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని వ్యాపారులకు నిరసనగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్యదర్శి నారాయణ మూర్తి సంబంధిత దుకాణాన్ని తనిఖీ చేసి విచారించారు. విచారణలో మోసం వెలుగు చూడటంతో సంబంధిత వ్యాపారులపై కేసు నమోదు చేసి చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ సందర్బంగా సెక్రటరీ నారాయణ మూర్తి మాట్లాడుతూ మోసపోయిన రైతులకు సంబంధిత వ్యాపారుల నుంచి 10 కేజీల వాము విలువను చెల్లించాలని ఆదేశించారు. దీంతో రైతుల వివాదం సద్దుమణిగింది.