ప్రతీకాత్మక చిత్రం
బాన్సువాడ : రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యాన్ని సేకరించి, దళారుల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలించి సొమ్ము చేసుకునే రైస్ మిల్లర్లను మోసం చేశాడో వ్యక్తి. రూ. కోటి రూపాయలతో పరారయ్యాడు. కొందరికి ఐపీ నోటీసులూ పంపినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
బాన్సువాడ ప్రాంతంలో పలువురు వ్యాపారులు ఖరీఫ్, రబీలలో రైతుల నుంచి ధాన్యం సేకరించారు.
గత ఖరీఫ్‌లో క్వింటాలుకు రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు మాత్రమే రైతులకు చెల్లించి ధాన్యం కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని దళారుల ద్వారా మహారాష్ట్రకు పంపి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. బాన్సువాడ మండలం లోని ఓ దళారి.. బాన్సువాడ, తాడ్కోల్, కోమలంచ, ముదెల్లి, రాంపూర్, కోటగిరి ప్రాంతాల్లోని పలువురు రైస్‌మిల్లర్ల నుంచి ధాన్యం సేకరించాడు.
సుమారు 300 లారీల వరకు ధాన్యాన్ని సేకరించి మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలించి సొమ్ము చేసుకొన్నాడు. ఒక్కో రైస్‌మిల్లర్‌కు రూ. 5 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ధాన్యం డబ్బులు ఇవ్వాలని అడగ్గా.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెబుతూ వస్తున్నాడు. బాన్సువాడ ప్రాంత రైస్‌మిల్లర్లు డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో పదిహేను రోజులుగా కనిపించకుండా పోయాడు.
దీంతో ఆందోళన చెందిన రైస్‌మిల్లర్లు.. మహారాష్ట్రలో ధాన్యం విక్రయించిన రైస్‌మిల్లర్లను కలిసి, డబ్బుల విషయమై అడిగారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులను నెల రోజుల క్రితమే ఇచ్చామని వారు సమాధానం ఇవ్వడంతో అవాక్కయ్యారు.
కాగా సదరు దళారికి బాన్సువాడలో రెండు ప్లాట్లు ఉండగా, వాటిని ఎవరికీ తెలియకుండా ఇటీవలే విక్రయించినట్లు సమాచారం. డబ్బుల కోసం తనపై ఒత్తిడి తీవ్రమవడంతో రైస్‌మిల్లర్లకు ఐపీ నోటీసులు పంపించినట్లు తెలిసింది. దళారీ ద్వారా మోసపోయిన రైస్‌మిల్లర్లు ఎవరికి ఫిర్యాదు చేయలేక మిన్నకుండిపోతున్నారు.
ఈ ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతుల వ్యవహారం మొత్తం జీరో వ్యాపారం కావడంతో వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సదరు దళారీ ద్వారా ఎంత మంది రైతులు మోసపోయారనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment