సాక్షి,లింగంపేట(కామారెడ్డి): ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్టపడడం లేదు. ఏదో ఒక పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కౌన్‌బనేగా కరోడ్‌పతిలో లాటరీ తగిలిందంటూ లింగంపేటకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు. ఎస్సై శంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన ఎండీ జియావుద్దీన్ వాళ్ల నాన్న ఫోన్‌కు ఈనెల 14వ తేదీన వాట్సాప్ మెస్సేజ్ వచ్చింది. అనంతరం వాట్సాప్ కాల్ చేసిన అగంతుకులు.. కౌన్‌బనేగా కరోడ్‌పతిలో లాటరీ తగిలిందని చెప్పారు.
లాటరీ సొమ్ము పొందాలంటే కొత్తగా బ్యాంకు అకౌంట్ తెరవాలని వెయ్యి రూపాయలు పంపాలని ఓ నంబర్ ఇచ్చా రు. నమ్మిన జియావుద్దీన్ పేటీఎంనుంచి వెయ్యి రూపాయలు పంపాడు. 15వ తేదీన అగంతుకుడు మరోసారి ఫోన్ చేసి రూ. 3 వేలు పంపించాలని చెప్పడంతో అలాగే చేశాడు. తర్వాత ఒకసారి రూ. వెయ్యి, ఇంకోసారి రూ. 3 వేలు, మళ్లీ రూ. 9 వేలు.. మొత్తం రూ. 17 వేలు పంపించాడు. భారీ లాటరీ వచ్చిందని, ట్యాక్సులకు డబ్బులు సరిపోవని, ఇంకా కొంతమొత్తం పంపాలని అగంతుకుడు చెప్పడంతో అనుమానించిన జియావుద్దీన్.. గురువారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment