మిర్చి ధరపై అనిశ్చితి | Uncertainty over the price of chilli | Sakshi
Sakshi News home page

మిర్చి ధరపై అనిశ్చితి

Published Sat, Dec 9 2017 2:26 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

Uncertainty over the price of chilli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో మిర్చి ధర మార్కెట్లో రూ. 12 వేలు పలికింది. ఈ ఏడాది జనవరి 10న రూ. 11,500, ఫిబ్రవరి 6న రూ. 9,100కు చేరింది. ఇలా ఏప్రిల్‌ 27 నాటికి క్వింటాల్‌ మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయింది. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతన్నలు అక్కడి వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్వింటాల్‌ మిర్చి ధర రూ. 4,700 – రూ. 9,600 ఉందంటే రానురాను పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చని వ్యవసాయ మార్కెటింగ్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు మార్కెట్లకు మిర్చి పెద్ద ఎత్తున తరలివస్తే, ధరలు మరింత పడిపోవచ్చనే భావన అధికారులను వెంటాడుతోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపారుల వద్ద నగదు లేక కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.  

87,220 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి... 
ఈ ఖరీఫ్‌లో 1.71 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో అధికంగా సాగు చేశారు. దీంతో ఈ సారి 87,220 మెట్రిక్‌ ట న్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాణిజ్య పంట కావడంతో మిర్చికి ఎటువంటి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయని, ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు.  

నిల్వకు అవకాశం లేక... 
మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో రైతులు మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటున్నారు. కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో లేక, ఉన్న కొన్ని స్టోరేజీలు వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement