
దర్జాగా కబ్జా
కదిరి ప్రాంతంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భూదందాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి.
→ 29 సెంట్ల మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించిన కదిరి మార్కెట్‌యార్డు చైర్మన్
→ స్థలం విలువ రూ.3 కోట్లు
→ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న మునిసిపల్ అధికారులు
→ కోర్టును ఆశ్రయిస్తామంటున్న వార్డు కౌన్సిలర్
కదిరి : కదిరి ప్రాంతంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భూదందాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. కదిరి వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌గా ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించిన టీడీపీ తలుపుల మండల కన్వీనర్ గరికపల్లి రామకృష్ణారెడ్డి 29 సెంట్ల మునిసిపల్ రిజర్వ్ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. ఆ స్థలం విలువ అక్షరాలా రూ.3 కోట్లు. అయితే.. ఆ స్థలం తాను కొనుగోలు చేశానంటూ తప్పుడు డాక్యుమెంట్లు చూపుతున్నారు. మరి.. అక్కడున్న మునిసిపల్ స్థలం ఏమైందని స్థానికులు ప్రశ్నిస్తే.. ‘ఏమో నాకేం తెలుసు?..ఈ ప్రశ్న మునిసిపాలిటీ వాళ్లను అడగండి’ అంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారు.
కొందరు ట్రాన్స్‌కో ఉద్యోగులు ‘ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ గా ఏర్పడి 1984లో కదిరి మునిసిపాలిటీæ పరిధిలోని మూడో వార్డులో సైదాపురానికి ఆనుకొని స్థలాన్ని కొనుగోలు చేశారు. సర్వే నంబర్ –197లోని 2.08 ఎకరాల ఈ స్థలానికి అప్పట్లో లే అవుట్ అప్రూవల్ కూడా చేయించుకున్నారు. మునిసిపల్ నిబంధనల ప్రకారం గుడి, బడి లేదా పార్కు లాంటివి ఏర్పాటు చేయడం కోసం వారు అప్పట్లో 29 సెంట్ల స్థలాన్ని రిజర్వ్ స్థలంగా వదిలేసి మునిసిపాలిటీకి అప్పగించారు. మునిసిపాలిటీ వారు ఆ స్థలానికి ఎల్‌పీ నెం.232/84 కేటాయించారు. దాన్ని అప్పట్లోనే స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నాళ్లూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. కాకపోతే మునిసిపాలిటీలో మొదటిసారి టీడీపీ అధికారంలోకి రావడంతో మునిసిపల్ స్థలాలు కబ్జా చేయడం ఆ పార్టీ నాయకులకు సులువైంది. ప్రస్తుతం కబ్జా చేసిన ఆ స్థలంతో పాటు పక్కనే రోడ్డు కోసం వదిలేసిన మూడు సెంట్ల ఖాళీ జాగాను కూడా కలిపేసుకున్నట్లు ‘సాక్షి’ నిఘాలో బయటపడింది. ఈ కబ్జా వెనుక టీడీపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి హస్తం కూడా ఉన్నట్లు వినబడుతోంది. మునిసిపల్ రిజర్వ్ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో తెలియజేస్తూ కదిరి మునిసిపల్ కార్యాలయం గోడపై అధికారులు పట్టిక వేయించారు. ఇందులో కూడా వరుస నంబర్ 3లో 29 సెంట్ల స్థలాన్ని చూపడం గమనించవచ్చు.