తుని ఘటనల నేపథ్యంలో పెట్టిన కేసుల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనిన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష
► మార్కెట్‌యార్డును ముట్టడించిన కాపులు
► అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
అంబాజీపేట : తుని ఘటనల నేపథ్యంలో పెట్టిన కేసుల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనిన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమసారథి ముద్రగడకు మద్దతుగా కాపు ఉద్యమకారులు సోమవారం అంబాజీపేటలో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని ఘెరావ్ చేశారు. మార్కెట్ యార్డులో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పులపర్తిని వందలాదిమంది కాపులు ముట్టడించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్‌ల సాధనకు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు వ్యంగ్యంగా మాట్లాడుతూ కాపు జాతిని కించపరుస్తున్నారని మండిపడుతూ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ముద్రగడ ఆమరణ దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. తమ నాయకుడు చావుబతుకుల మధ్య ఉంటే సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఎంతవరకూ సబబని నిలదీశారు. ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో భారీగా పోలీసులను మోహరించారు. తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తి వేయాలని, కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించారు. కాపు నాయకుల డిమాండ్‌లను సీఎం దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు అసెంబ్లీ సమావేశంలో చర్చించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.