మార్కెట్ పీఠంపై మహిళ! | khammam agriculture market chairman allotment to women? | Sakshi
Sakshi News home page

మార్కెట్ పీఠంపై మహిళ!

Published Mon, Apr 11 2016 10:53 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

khammam agriculture market chairman allotment to women?

వ్యవసాయ మార్కెట్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్‌లలో దాదాపు నాలిగింట్లో మహిళలు చైర్‌పర్సన్ అయ్యే అవకాశం ఉంది. మైదానంలో ఇద్దరు, ఏజెన్సీలో ఇద్దరికి ఈ అవకాశం లభించవచ్చు.

 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తూ ఎప్పటి నుంచో
 అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్న పలువురు
 ఆశావహుల్లో ఈ పరిణామంతో ఆందోళన నెలకొంది.

 

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చట్టం మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్‌ను నామినేటెడ్ పదవుల భర్తీలో అమలు చేయాలని భావిస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదలు నామినేటెడ్ పదవుల్లోనూ స్త్రీలకు పెద్దపీట వేసే దిశగా చర్యలు చేపట్టింది. గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులకు గత ఏడాది ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. అంతటితో ఆగని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకూ రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసింది.

మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలపడంతో మార్కెటింగ్‌శాఖ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈమేరకు 33 శాతం మహిళలు చైర్‌పర్సన్‌లుగా ఎంపికవుతారు. రాష్ట్రవ్యాప్తంగా 179 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా 59 మంది మహిళలు చైర్‌పర్సన్‌లయ్యే అవకాశం ఉంది. వీటిలో 11 వ్యవసాయ మార్కెట్‌లు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఇందులోనూ ఎక్కువ మార్కెట్‌లు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్లు ఏజెన్సీలో ఉన్నాయి. 1996 పెసా చట్టం ప్రకారం ఈ వ్యవసాయ మార్కెట్ పదవులను ఎస్టీలకు కేటాయించారు.

 13 మార్కెట్లలో నలుగురు చైర్‌పర్సన్‌లు..
 జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 7 వ్యవసాయ మార్కెట్‌లు ఏజెన్సీలో, 6 మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఏన్కూరు, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం, దమ్మపేట, చర్ల వ్యవసాయ మార్కెట్‌లు ఏజెన్సీలో ఉన్నాయి. ఈ మార్కెట్‌ల కమిటీలను ఎస్టీలకే కేటాయించారు.  మైదాన ప్రాంతంలో ఖమ్మం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నాయి. ఖమ్మం, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులను బీసీలకు, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి మార్కెట్‌లను ఓసీలకు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించారు. ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఈ పదవులపై ఆశపెట్టుకున్న నేతల్లో ఆందోళన నెలకొంది.

 నలుగురికి చాన్స్?
 జిల్లాలో మొత్తం వ్యవసాయ మార్కెట్‌లను పరిగణలోకి తీసుకొని వాటిలోనూ 33 శాతం కమిటీ చైర్మన్ పదవులను మహిళలకే కేటాయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఖాయమైతే జిల్లాలోని మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లలో 33 శాతం మహిళలకు కేటాయిస్తే నలుగురు మహిళలకు చైర్‌పర్సన్ పదవులు దక్కే అవకాశం ఉంది. దీనిలో రెండు ఏజెన్సీలో, రెండు మైదాన ప్రాంతంలో ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కులాల వారీగా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటే మహిళా రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంది.

 ఆశావహుల్లో అయోమయం
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది వ్యవసాయ మార్కెట్ పదవులకు రిజర్వేషన్లు కల్పించింది. పలువురు ఆశావహులు ఈ పదవులను దక్కించుకోవడం కోసం ఏడాదిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నాయకులు ఈ పదవుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రూ.1500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని గతంలో బీసీకి కేటాయించారు. బీసీ వర్గానికి చెందిన పలువురు నాయకులు ఆ పదవి కోసం వెంపర్లాడుతున్నారు.

మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి చైర్మన్ పదవులను ఓసీలకు రిజర్వ్ చేశారు. వైరా చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి..కాబట్టి ఈ రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తమ కేటగిరీకి కేటాయించిన మార్కెట్లు మహిళలకు రిజర్వేషన్ కాకుండా చూడాలని ఆయా వర్గాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం ఒకవేళ తమకు పదవి దక్కకపోతే తమ భార్యలకైనా చైర్‌పర్సన్ పదవి ఇప్పించాలని పలువురు పావులు కదుపుతున్నట్లు సమాచారం. వారం రోజుల్లో మహిళలకు కేటాయించే స్థానాలను నిర్ణయించి, నెల రోజుల్లో మార్కెట్ కమిటీలను భర్తీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement