
పసుపు దళారులకు కాసుల పంట
► నేతల ఒత్తిళ్లతో నాసిరకం కొనుగోళ్లు
► ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం
ఉదయగిరి ప్రాంతంలో రైతులు సాగుచేసిన పసుపును గతేడాది వరకు వైఎస్సార్, గుంటూరు జిల్లా దుగ్గిరాల ప్రాంతాల్లో కష్టపడి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో రైతుల కష్టాలను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉదయగిరిలో ఈ ఏడాది పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి బయట జిల్లాల్లో తక్కువ ధరకు నాసిరకం సరుకు కొనుగోలు చేసి ఈ కేంద్రంలో అమ్ముకొని రూ.లక్షల్లో లాభాలు గడించారు. మార్క్‌ఫెడ్ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నేతలకు బాసటగా నిలిచారు.
ఉదయగిరి : ఉదయగిరిలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రంలో నాణ్యతలేని సరుకును మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వచ్చింది. జూన్ 30వ తేదీలోపు సుమారు రూ.195 కోట్ల విలువ కలిగిన 3,200 టన్నుల సరుకును కొనుగోలు చేశారు. ఇందులో రూ.50 కోట్లు పైగా నాసిరకం, పుచ్చిన, తడిసిన, ఎందుకూ పనికిరాని సరుకును ఈ కేంద్రంలో దళారులు నుంచి కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు.
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జూన్ 5వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎ–గ్రేడ్ రకానికి రూ.6,500, బి–గ్రేడ్‌కు రూ.6 వేలు వంతున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ కేంద్రం పరిధిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో పసుపు సాగుచేసినట్లుగా వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేంద్రానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు కూడా తాము పండించిన పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.
ఈ కేంద్రం పరిధిలో 700 టన్నులు పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైతులు మే 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఈ క్రమంలోనే కొంతమంది రైతులు కడప, దుగ్గిరాల ప్రాంతాల్లో నాసిరకం సరుకు కొనుగోలు చేసి ఈ కేంద్రంలో విక్రయించి 20 టన్నుల లారీల సరుకుకు సుమారు రూ.3 లక్షల మేర లాభాలు గడించారు.
అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి కడప, దుగ్గిరాల ప్రాంతాలలోని ట్రేడర్ల వద్దనున్న నాసిరకమైన సరుకును తక్కువ ధరకు కొనుగోలుచేసి ఈ కేంద్రంలో విక్రయించి కాసుల పంట పండించారు. జూన్ 10 నుంచి 30వ తేదీ వరకు సుమారు రెండు వేల టన్నుల సరుకును దళారులు ఈ కేంద్రంలో విక్రయించినట్లు సమాచారం. జూన్ 30వ తేదీ నాటికి ఈ కేంద్రం నుంచి 3,200 టన్నుల సరుకును కొనుగోలు చేశారు. ఇందులో ఎక్కువ భాగం దళారుల ద్వారా కొనుగోలు చేసిందే.
నాసిరకం సరుకు కొనుగోలుకు ఒత్తిళ్లు
పసుపు కొనుగోలు కేంద్రాన్ని జూన్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మూసివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. అయినా ఆ రోజు సాయంత్రం వరకు రాజకీయ నాయకులకు చెందిన సుమారు పది లారీల నాసిరకం సరుకు కొనుగోలు కేంద్రం ఆవరణలో ఉంది. దీనిని కొనుగోలు చేయాలని ఆ నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు వాటిని కొనుగోలు చేయకపోవడంతో లారీలు అక్కడే ఉన్నాయి.
ఈ సరుకు కడప ప్రాంతంలో ట్రేడర్ల వద్ద ఉన్న అత్యంత నాసిరకమైన సరుకు. దీనిని కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ సిబ్బందిపై ఈ సరుకుకు సంబంధించిన రాజకీయనేతలు తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేరు చెప్పి అధికారులను బెదిరించి ఈ సరుకును విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే గోదాములో నిల్వ ఉన్న సరుకులో సింహభాగం నాసిరకమైన సరుకని అందులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది స్వయంగా చెబుతున్నారు.
ఏది ఏమైనా రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రం దళారుల అవతారమెత్తిన రాజకీయ నేతలకు కాసుల పంట కురిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పలుకుబడిని ఉపయోగించుకొని లబ్ధిపొందారని విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలుచేసి నాణ్యతను పరిశీలిస్తే అసలు గుట్టు రట్టవుతుందనడంలో సందేహం లేదు.