• జయరాములు, విజయమ్మలకు ప్రిస్టేజీగా మారిన కమిటీ ఎంపిక వ్యవహారం
• పరస్పరం మద్దతుదారులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు
• ఎమ్మెల్యే సూచించిన ప్యానల్‌కు మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం
• విజయమ్మ శైలిపై సీఎంకు ఫిర్యాదు ?
బద్వేలు అర్బన్: అధికారపార్టీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డారుు. టీడీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలపై జరిగిన రచ్చ మరవకముందే తాజాగా మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఆ పార్టీలో మరో చిచ్చు లేపినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలో చేరిన జయరాములుకు, మాజీ ఎమ్మె ల్యే విజయమ్మలకు ఈ వ్యవహారం ప్రతిష్టగా మారింది. దీంతో ఇరువురు ఎదుటి వారి మద్దతుదారులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఒకానొక దశలో ఎమ్మెల్యే జయరాములు సూచించిన వ్యక్తికి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు అధిష్టానం ఒప్పుకుని సంబంధిత శాఖాధికారులకు సూచించిన సమయంలో విజయమ్మ రంగప్రవేశం చేసి తన అనుచరవర్గంతో కూడిన ప్యానల్‌ను ప్రకటించాలని సంబంధిత అధికారులకు నివేదిక ఇవ్వడంతో విభేదాలు తారాస్థారుుకి చేరారుు. విషయం తెలుసుకున్న జయరాములుతో పాటు ఆయన అనుచరులు విజయమ్మ వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మార్కెట్‌యార్డు చైర్మన్ ఎంపికను తాత్కాలికంగా నిలిపేసినట్లు సమాచారం.
పట్టుకోసం ఎవరికి వారే..
బద్వేలు మార్కెట్‌యార్డు చైర్మన్ ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మలకు ప్రిస్టేజిగా మారింది. గతంలో విజయజ్యోతి అనుచరుడిగా ఉంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే జయరాములుతో తిరుగుతున్న పోరుమామిళ్లకు చెందిన కలవకూరి నడిపి వెంకటసుబ్బయ్యకు మార్కెట్‌యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానానికి ఎమ్మెల్యే సిఫారసు చేశారు. దీనికి అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించి వెంకటసుబ్బయ్య పేరునే ఖరారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వెంకటసుబ్బయ్య అనుచరులు పోరుమామిళ్లలో బాణాసంచా పేల్చి సంబరాలు కూడా జరుపుకొన్నారు.
ఇంతలో విషయం తెలుసుకున్న విజయమ్మ పోరుమామిళ్లకు చెందిన తన అనుచరుడైన రంతుకు చైర్మన్ పదవిని , మరో ముఖ్య అనుచరుడైన బద్వేలుకు చెందిన కేవి.సుబ్బారెడ్డిని వైస్‌చైర్మన్‌గా నియమించాలని 14 మంది డెరైక్టర్లతో కూడిన ఓ ప్యానల్‌ను తయారుచేసి పార్టీకి చెందిన ఓ జిల్లా ముఖ్యనేత ద్వారా అధికారులకు పంపినట్లు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు ఎవరి ప్యానల్‌ను ప్రకటించాలో తెలి యక గందరగోళానికి గురవుతున్నట్లు తెలిసింది.
సీఎం కార్యాలయంలోనే తారుమారు!
మార్కెట్‌యార్డు చైర్మన్ ఎంపికలో తాను సూచించిన అభ్యర్థిని కాదని విజయమ్మ తన అనుచరవర్గాన్ని ప్రతిపాదిస్తూ అందుకు సంబంధించిన నివేదికను సీఎం క్యాంపు కార్యాలయంలోనే తారుమారు చేసినట్లు ఆరోపిస్తూ గురువారం ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే జయరాములు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి సైతం తాను సూచించిన నివేదికను కాదని వేరే నివేదికను అధికారులకు ఎవరు పంపారని కార్యాలయ సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తమ్మీద బద్వేలు టీడీపీలో చిచ్చురేపుతున్న మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఎవరి వర్గీయులను వరించనుందో వేచిచూడాలి.