త్వరలో కొత్త మార్కెట్ చట్టం: హరీష్‌రావు
హైదరాబాద్:
మార్కెట్‌యార్డుకు బయట కొనుగోలుచేసిన ధాన్యానికి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా నూతన చట్టాన్ని అమల్లోకి తేబోతున్నామని సాగునీటి, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావు ప్రకటించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మార్కెటింగ్ శాఖలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ రైతులు విక్రయించిన ధాన్యానికి వచ్చిన రూ.920 కోట్లు నగదును రైతుల అకౌంట్లలోకి బదిలీ చేశామని చెప్పారు. హమాలీ, దడ్వాయి, చేట కూలీలతో కలిపి మార్కెట్లలో 15399 మంది కూలీలు పనిచేస్తున్నారని వారికి కూడా నగదు రహిత లావాదేవీల ద్వారానే డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు.