మార్కెట్ యార్డుల్లో సకల వసతులు
- - రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు
- గజ్వేల్ యార్డులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
గజ్వేల్: రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో గోదాములు, ఇతర వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ మార్కెట్ యార్డులో రూ.5.85కోట్లతో చేపట్టిన రెండు 2,500 మెట్రిక్ టన్నుల గోదాములు, కవర్ షెడ్లు, రైతు విశ్రాంతి, సమావేశ భవనం, సీసీ రోడ్లు, ఆర్చ్ తదితర పనులను ప్రారంభించారు. అలాగే ములుగు మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే వసతుల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. కొత్తగా రూ.4కోట్లతో కొండపాక మార్కెట్‌యార్డు అభివృద్ధికి సంకల్పించామన్నారు.
ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. వర్గల్ మండలం పాతూరు రోడ్డు వద్ద కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారుల కోసం షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం స్థల సేకరణ చేపట్టాలని ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావును ఆదేశించారు. ములుగు మండలం దామరకుంటలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను, ములుగులోని గురుకుల పాఠశాలలో డార్మెటరీ, ల్యాబ్‌లను మంత్రి ప్రారంభించారు.
పాఠశాల ప్రహరీకి రూ.36లక్షలు, మరమ్మతులు, రంగులు వేయడానికి రూ.16 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి హరీశ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.