ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్‌కౌంటర్లు | Emergencies and Encounters in Indiras reign kcr | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్‌కౌంటర్లు

Published Sat, Nov 25 2023 2:10 AM | Last Updated on Sat, Nov 25 2023 6:03 AM

Emergencies and Encounters in Indiras reign kcr - Sakshi

భూపాలపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి.

రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్‌ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్‌ఎస్‌ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. 

తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం 
‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం.  బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్‌ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం.

చందూలాల్‌ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్‌ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్‌ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్‌ చెప్పారు. 

దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు 
    ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్‌ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్‌ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్‌పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్‌గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్‌ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్‌కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్‌ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.  

మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్‌ వస్తది 
    ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్‌ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్‌ఎస్‌ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్‌ కోరారు.

‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి),  నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్‌ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement