మద్దతు కరువు!
ఉల్లి రైతు కంట కన్నీరు
- మద్దతు ధరకు దూరమైన 4వేల మంది రైతులు
- గత డిసెంబర్ 21 నుంచి పట్టించుకోని కలెక్టర్
- రూ.600లోపు ధరతో విక్రయించిన ఉల్లి 4.50 లక్షల క్వింటాళ్లు
- మొత్తం రైతులు 13,566
- మద్దతు 3,797 రైతులకే పరిమితం
లారీ బాడుగ కూడా దక్కలేదు
గత ఏడాది ఖరీఫ్‌లో 1.88 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినా. పెట్టుబడి రూ.75వేలు అయ్యింది. 90 క్వింటాళ్ల పంట వచ్చింది. కర్నూలు మార్కెట్‌కు గత అక్టోబర్ 15న తీసుకొస్తే వ్యాపారులు కొనలేదు. మరుసటి రోజున వేలం పాటకు పెడితే రూ.90 ప్రకారం కొనుగోలు చేసినారు. ఈ ధర లారీ బాడుగలకు కూడా సరిపోలేదు. మద్దతు కోసం మార్కెట్‌లో 2631 నెంబర్ కార్డుపై తహసీల్దారు, వీఆర్‌ఓ సంతకాలు పెట్టించుకొని వచ్చి అదే నెలలోనే అందజేసినా. క్వింటాకు రూ.300 మద్దతు కల్పించాలి. నా కుమారుడు శివశంకర్ పేరు మీద కార్డు ఉంది. ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
- మూల బీరప్ప, కొత్తపల్లి, పత్తికొండ మండలం
మద్దతు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నాం
ఖరీఫ్‌లో ఒక ఎకరాలో ఉల్లి సాగు చేసినా. పెట్టుబడి రూ.35వేల వరకు వచ్చింది. 43 క్వింటాళ్ల దిగుబడి రాగా గత అక్టోబర్‌లో కర్నూలు మార్కెట్‌లో క్వింటా రూ.430 ప్రకారం అమ్మినా. ఈ లెక్కన క్వింటాకు రూ.170 ప్రకారం మద్దతు ధర రావాల్సి ఉంది. 963 కార్డులో అన్ని వివరాలు సక్రమంగా పూర్తి చేసిచ్చినా. మార్కెట్ కమిటీ అధికారులు కంప్యూటర్‌లో పేరు తప్పుగా నమోదు చేయడంతో మద్దతు ధరకు దూరమయ్యా. ఆ తర్వాత తప్పు సరిదిద్దినా ఇప్పటికీ నగదు అందలేదు.
- ఖాజన్న, సుంకేసుల, కర్నూలు మండలం
కర్నూలు(అగ్రికల్చర్): అధికారుల నిర్లక్ష్యం ఉల్లి రైతుకు శాపంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉన్నా డిసెంబర్ 20 నాటికే ముగించడం వేలాది మంది రైతులకు నిరాశే మిగిలింది. కష్టాల్లోని రైతుల పట్ల అధికారులు కాస్త సానుభూతి చూపినట్లయితే రూ.3.23 కోట్లు మద్దతు రూపంలో లభించేది. జిల్లాలో 4వేల మంది రైతులు మద్దతు ధరకు దూరమవడం చూస్తే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో తెలుస్తోంది. ఉల్లి సాగులో దేశంలోనే మహారాష్ట్రలోని పూనె మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానం కర్నూలుదే. 2016 ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి ఆగస్టు నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. రాష్ట్రంలోనే ఉల్లి క్రయ విక్రయాలు కలిగిన ఏకైక మార్కెట్ కర్నూలు.
ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచే మార్కెట్‌లో ఉల్లి ధర నేలను తాకింది. క్వింటాకు సగటున రూ.250 నుంచి రూ.300 ధర మాత్రమే లభించింది. రూ.50 నుంచి రూ.100 ధరతో అమ్ముకున్న రైతులు 20 శాతం వరకు ఉన్నారు. ధర లభించక అనేక మంది రైతులు దిగుబడులను మార్కెట్‌లోనే వదిలేశారు. ఆ సందర్భంగా మద్దతు ధర కల్పించాలని రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. దిగొచ్చిన ప్రభుత్వం క్వింటాకు రూ.600 మద్దతు ధర ప్రకటిస్తూ గత అక్టోబర్ 6న జీవో జారీ చేసింది. అయితే జిల్లా యంత్రాంగం గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు కల్పించేలా చర్యలు తీసుకుంది. క్వింటా ఉల్లిని రూ.300లోపు అమ్ముకుంటే మద్దతు కింద రూ.300 లభిస్తుంది. రూ.400లకు అమ్ముకుంటే రూ.200 మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
అధికారుల చుట్టూ తిరగలేక..
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ఏడాది సెప్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ.600 లోపు ధరకు అమ్మకున్న రైతులందరకీ మద్దతు వర్తిస్తుంది. ఈ కాలంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో 13,566 మంది రైతులు 4.50లక్షల క్వింటాళ్ల ఉల్లిని రూ.600 కంటే తక్కువ ధరకు అమ్మకున్నారు. వీరందరికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బ్యాలెన్స్ మొత్తం మద్దతుగా చెల్లించాలి. అయితే దాదాపు 8వేల మంది రైతులు మాత్రమే మద్దతు ధర కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారు అధికారులు చుట్టూ తిరుగలేక.. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మద్దుతు ధరను స్వచ్ఛందంగా వదులుకున్నారు.
3,797 మంది రైతులకే మద్దతు
ఉల్లికి మద్దతు ధర పొందేందుకు మార్కెట్ కమిటీ ప్రత్యేకంగా కార్డులు ముద్రించింది. వీటిలో రైతులు ఉల్లి సాగు చేసినట్లు, ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వచ్చింది తదితర వివరాలు ఉంటాయి. ఈ కార్డుపై రైతులు సంబంధిత తహసీల్దారు, వీఆర్‌ఓ సంతకాలు చేయించుకొని కర్నూలు మార్కెట్ యార్డులో అందజేయాలి. వీటిని మార్కెట్ కమిటీ సెక్రటరీ పరిశీలించి మార్కెటింగ్ శాఖ ఏడీకి.. ఆయన వాటిని జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదించిన తర్వాత ఏడీఏం మద్దతు ధరను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. మార్కెట్ కమిటీ అధికారులు 7,796 మంది రైతులతో మొత్తం 70 లిస్టులు తయారు చేశారు.
ఇందులో 60 లిస్టులను ఏడీఎంకు పంపారు. అయితే జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డిసెంబర్ 20 వరకు ప్రతి రోజూ ఉల్లి మద్దతు జాబితాలను పరిశీలించారు. ఆ మేరకు 37 జాబితాలను ఆమోదించారు. వీటికి సంబంధించి 3,797 మంది రైతులకు మద్దతు కింద రూ. 3,76,91,218.42 రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
4వేల మంది రైతులకు మొండిచెయ్యి
సెప్టంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28లోపు మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.600 లోపు ధరకు అమ్మకున్న రైతులు 4వేల మంది మద్దతుకు దూరమయ్యారు. వీరంతా మార్కెట్ కమిటీ అధికారులు ఇచ్చిన కార్డులపై అన్ని సంతకాలు చేయించి అందజేశారు. ఇందులో 300 కార్డుల్లో కొన్ని తప్పులు ఉన్నా.. మిగిలినవన్నీ సక్రమంగా ఉన్నాయి. డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తాను మళ్లీ చెప్పే వరకు ఉల్లి రైతుల మద్దతు జాబితాలను తన వద్దకు తీసుకురావొద్దని ఏడీఎంను ఆదేశించారు. అప్పటి నుంచి వీటిని పట్టించుకున్న దాఖలాల్లేవు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం
మొదట్లో అర్హులైన రైతులందరికీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్దతు ధర కల్పించాం. డిసెంబర్ 20 వరకు 3,797 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత నుంచి ఉల్లి మద్దతు నిలిచిపోయింది. దాదాపు 4వేల మంది రైతులకు మద్దతు అందించాల్సి ఉంది. ఈ జాబితాలో కొన్ని తప్పులు ఉన్నాయి. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
- సత్యనారాయణ చౌదరి, ఏడీఎం, కర్నూలు