రైతు మద్దిలేటి పొలంలోనే వదిలేసిన ఉల్లి పంట
ఉల్లి రైతు ఉసురు తీసిన ధర
Published Tue, Nov 8 2016 9:09 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- గోరంట్లలో ఉరేసుకొని రైతు ఆత్మహత్య
కోడుమూరు రూరల్: పతనమైన ఉల్లి ధర ఓ రైతు ప్రాణం తీసిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని భార్య కిష్టమ్మ తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన మద్దిలేటి(45) సర్వీసు ఇనామ్ కింద మాధవస్వామి దేవస్థానం నుంచి సంక్రమించిన నాలుగు ఎకరాల పొలం సాగు చేసుకుంటున్నాడు. ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో ఉల్లి, ఎకరా పొలంలో పత్తి సాగు చేశాడు. పంటల సాగుకు రూ.1.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇదే సమయంలో పొలానికి నీటి సదుపాయం కోసం బోరు, పైపులైన్లు వేసేందుకు సుమారు రూ.2.50 లక్షల వరకు అప్పు చేశాడు. రైతు కష్టం ఫలించి దిగుబడి బాగానే వచ్చినా గిట్టుబాటు ధర లేకపోయింది. కర్నూలు మార్కెట్‌లో క్వింటా ధర రూ.50 నుంచి రూ.500 ల్లోపే ఉండటం.. ప్రభుత్వం మద్దతు ధర రూ.600 ప్రకటించినా ఎప్పటికి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఆ ఊరి నుంచి సరుకు తీసుకెళ్లిన రైతులకు కూడా క్వింటా రూ.300ల్లోపే ఉండటం మరింత కృంగదీసింది. మార్కెట్‌కు తరలించినా రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కావని భావించి.. పంటను పొలంలోనే పశువులకు వదిలేశాడు. అయితే ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పు రూ.4లక్షలు తీర్చే దారి లేక మనోవేదనకు లోనయ్యాడు. సోమవారం రాత్రి ఇదే విషయమై భార్య బాధ పడుతుండటంతో వెళ్లి బయట పడుకోమని చెప్పి పంపాడు. ఆమె వెళ్లి బయట పడుకున్న సమయంలో గుడిసెలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి పెళ్లయిన కుమారుడు ఉండగా వీరు కూడా బయటే పడుకుని ఉండటంతో.. జరిగిన ఘటనను మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు.
Advertisement
Advertisement