కర్నూలు: ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక.. చేసిన అప్పులు తీర్చలేనన్న బెంగతో పడిదెంపాడు గ్రామానికి చెందిన జక్కం మద్దిలేటి (36) పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి సరిగా రాక నష్టపోయాడు. పెట్టుబడి కోసం బయట వ్యక్తుల దగ్గర భారీగా అప్పు చేశాడు. ఈ సంవత్సరం ఉల్లి పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈనెల 14వ తేదీన దిగులుతో పొలంలోనే పురుగుల మందు తాగాడు. భార్య శ్యామల గుర్తించి.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 15వ తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.