మోసగాళ్ల అడ్డాగా ‘రాజధాని’
ప్రత్యేక యంత్రాంగం లేకపోవడంతో చెలరేగుతున్న నేరగాళ్లు
పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు బలవుతున్న సామాన్యులు
మాయమాటలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం
గుంటూరుకు చెందిన డాక్టర్ రావుకు పెనమలూరు మండలం కానూరులో నివేశన స్థలం ఉంది. దానిని విక్రయించేందుకు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఇద్దరు బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి స్థలం కాగితాలు తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి మరొకరికి విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు రావుకు తెలిసి నిలదీశారు. దీంతో బ్రోకర్లు కొంత డబ్బులు ఇస్తే అడ్డు తొలుగుతామంటూ బెదిరిం చారు. విధిలేని స్థితిలో బాధితుడు పోలీసు కమిషనర్‌ను కలవగా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
నగరంలోని శుభదర్శి చిట్‌ఫండ్స్ రూ.200 కోట్ల మేర డిపాజిటర్లను ముంచింది. గత ఏడాది జులైలో ‘శుభదర్శి’ మూత పడటంతో వందలాది మంది బాధితులు లబోదిబోమన్నారు. పాతికేళ్లుగా డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న శుభదర్శి పెట్టుబడులను స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్టు అయితే చేశారుకానీ బాధితులకు న్యాయం జరగలేదు.
పటమటలంకకు చెందిన వంశీకృష్ణ మెడికల్ సీట్ల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టాడు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులకు కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు. సీట్ల విషయం ఆరా తీస్తే రేపు మాపంటూ తిప్పసాగాడు. అనుమానంతో కొందరు తల్లిదండ్రులు వాకబ్ చేయగా వంశీకృష్ణ మోసం వెలుగు చూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
విజయవాడ : రాజధాని ఆర్థిక నేరాలకు అడ్డాగా మారింది. ప్రైవేట్ చిట్స్ ఎగవేత.. తప్పుడు పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వసూళ్లు.. కాల్‌మనీ పేరుతో వేలకు వేలు రోజువారీ వడ్డీలకు ఇస్తూ వేధించడం.. ఇలా ఎక్కడ చూసినా మోసాలే. ఆర్థిక నేరాలను అరికట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని ఆర్థిక నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. అప్పులు ఇచ్చి వేధింపులకు దిగుతున్న వారిపై 20 రోజుల్లో నగర పోలీస్ కమిషనర్‌కు 750 ఫిర్యాదులు అందాయి. కాల్‌మనీ వ్యాపారులు నగరంలో ఎలా రెచ్చిపోతున్నారో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.
చిట్స్ పేరిట మోసాలు..
ప్రైవేటు చిట్స్ నగర సంస్కృతిలో అంతర్భాగమయ్యాయి. ఏళ్ల తరబడి ఇళ్ల వద్ద చిన్నపాటి చిట్టీలతో నమ్మకం పెంచుకుంటున్నారు. ఆపై లక్షల్లో చిట్స్ వేస్తూ కోట్ల రూపాయలు ఎగవేతకు పాల్పడుతున్నారు. పైసా పైసా కూడబెట్టిన సొమ్ము చిట్స్‌లో పెట్టి అనేక మంది వీధుల పాలవుతున్నారు. ఏడాది కాలంలో వంద మందికి పైగా ప్రైవేటు చిట్స్ ఎగవేతకు పాల్పడినవారు ఉన్నారు. అనేక మంది చిరు వ్యాపారులు, ఉద్యోగులు వీరి బారిన పడి సర్వం కోల్పోయారు.
తప్పుడు రిజిస్ట్రేషన్లు..
రాజధాని కావడంతో భూముల విలువ అమాంతంగా పెరిగింది. తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టే ముఠాలు తయారయ్యాయి. ఆపై న్యాయస్థానంలో వ్యాజ్యాలు వేస్తూ అసలు యజమానులతోనే బేరసారాలకు దిగుతున్నారు. పోలీసుల వద్దకు వచ్చినా భూములకు సంబంధించి వివాదాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు అవసరమైన యంత్రాంగం లేక విచారణ పేరిట సాగదీస్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసాలకు అంతే లేదు.
ఉద్యోగాల పేరిట మోసం..
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసగించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొందరు పోలీసు ఉద్యోగుల తాలూకు బంధువులు కూడా ఉద్యోగాల పేరిట మోసగించిన వారిలో ఉండటం విశేషం.
ప్రత్యేక విభాగమేది..
పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాలను అరికట్టేందుకు నామమాత్రం వ్యవస్థ మాత్రమే ఉంది. సీసీఆర్‌బీ ఏసీపీ పర్యవేక్షణలో సిటీ స్పెషల్ బ్రాంచిలోని ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంలో అదనపు విధులు నిర్వహిస్తున్నారు. ఈ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరంపై నగర పోలీసు అధికారులు అనేకమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆర్థిక నేరాలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుతోనే ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
గత మూడేళ్లలో నమోదైన చీటింగ్ కేసులు
2013లో కేసులు 358
2014లో కేసులు 328
2015లో కేసులు 392