సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొందరు జనం మీద పడి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ఫలానా అధికారి తనకు బాగా తెలుసునని, మాతో వస్తే మీ పని సులభంగా జరిగిపోతుందని జనాన్ని నమ్మిస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.. ఇంకొందరు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై పడుతున్నారు.. నిబంధనల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది హల్ చేస్తూ ప్రజలకు, ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల పేరుజెప్పి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, జనాన్ని మాయచేస్తున్నారు. కొందరిని ’స్పందన’ సాక్షిగా కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. నిజానికి కొన్ని ప్రభుత్వ విభాగాలనే అలాంటి వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటే అతిశయోక్తికాదు.
విజయనగరం జిల్లా అంటేనే మంచి తనంతో కూడిన అమాయకత్వం కలిగిన ప్రజలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి చేతనైన సాయం, అవసరమైన సేవ చేస్తున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఆయా సంఘాలు, సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమవంతు కృషిచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారికి భిన్నంగా అలాంటి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీ ల ముసుగులో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ పదవి లేకపోయిన, కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఏ పదవీ చేపట్టకపోయినా పార్టీ రాష్ట్ర పదవులు అనుభవిస్తూ అమరావతి నుంచి విజయనగరం వరకూ తనకు అందరితోనూ పరిచయాలున్నాయని చెప్పుకుంటున్న ఓ నాయకుడున్నారు. జిల్లా అధికారులు నిత్యం ఎక్కడికి వెళుతుంటారు?, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంటారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవడమే అతని పని. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడనేగా మీ అనుమానం. అధికారుల కదలికలపై అవగాహన వచ్చిన తర్వాత వారికి అతను ఫోన్ చేస్తాడు. కలవాలని చెబుతాడు. కలిసిన తర్వాత ఆ అధికారి గురించి అతను తెలుసుకున్నదానిని వివరిస్తాడు. వ్యక్తి విషయాలను బయటపెడతానని బెదిరిస్తాడు.
మంచి అంశాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. అతని చర్యలకు భయపడిపోయిన అధికారి అతనికి లొంగిపోతున్నాడు. ఆ తర్వాత అతను ఆడించినట్లుగా ఆడటం తప్ప ఆ అధికారికి మరో మార్గం ఉండదు. వారి నుంచి సమాచారం తెలుసుకుని రేపు వారు మంజూరు చేయబోయే ప్రాజెక్టులు, రుణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులను ఈ నాయకుడు ముందురోజే అధికారి వద్దకు తీసుకువెళ్లి పని జరిపించాల్సిందిగా వినతిపత్రం ఇస్తారు. మర్నాడు ఆ పని జరగగానే తన వల్లనే ఆ పని జరిగిందని చెప్పి లబ్ధిదారుల నుంచి సొమ్ములు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇటీవల పసిగట్టారు. అతని దుర్భుద్ధిని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు.మరో వ్యక్తి ఉన్నాడు.. అతనూ ఒక పార్టీ నేతనని, ఒక సామాజిక వర్గానికి ప్రతినిధినని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ ఎన్నికల్లో ఏనాడూ గెలిచింది లేదు. అయినా, నిత్యం ఏదోఒక పనిజెప్పి జిల్లా అధికారుల వద్దకు వెళుతుంటాడు. సమస్యలతో ఉన్న ప్రజలను వెంటబెట్టుకుని అధికారులకు వినతిపత్రం ఇస్తుంటాడు. ఆ సమస్య పరిష్కారం అయితే తనగొప్పతనమేనని చెప్పి తానూ ఆర్థిక లబ్ధి పొందుతుంటాడు. ఈ మధ్య ఒకడుగు ముందుకువేసి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను అధికారులచేత పరిష్కారం చేయించేస్తానంటూ మొదలుపెట్టాడు.
అతను అనుకున్నది జరిగితే సరే లేదంటే బయటకు వచ్చి ‘ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు. అధికారులు పనిచేయడం లేదు’.. అంటూ ప్రచారం చేస్తుంటాడు. తద్వారా అధికారులను నైతికంగా కుంగదీసి పనులు జరిపించుకోవాలనేది అతని ఎత్తుగడ. అయితే, ఈ ప్రయత్నాలను కూడా కలెక్టర్ పసిగట్టారు. నలుగురి ముందు అతని దుర్భుద్ధిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరిద్దరూ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. సమాచారహక్కు చట్టం, మానవహక్కులు, విద్యార్థి, మహిళా సంఘాల పేరుతో అధికారులు, ప్రజలను దోచుకుతినడమే పనిగాపెట్టుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలైతే ఇలాంటి వారిపట్ల తీవ్ర వేదనకు గురవుతున్నాయి. సెలవుల్లో తరగతులు పెడుతున్నారనో, కంప్యూటర్ ల్యాబ్‌లు లేవనో, ఆట స్థలాలు లేవనో విద్యా సంస్థలను నిలదీస్తుంటారు. ఆ సౌకర్యాలను రప్పించడం కోసమైతే పర్లేదు. కానీ కాదు.
అలా నిర్వాహకులను బెదిరించి ఎంతో కొంత డబ్బు తీసుకుని సైలెంట్‌గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ సౌకర్యాల ఊసెత్తరు. ఎవరైనా తమకు అనుకూలంగా లేకపోతే ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడిగా చేసేస్తుంటారు. ఈ గోలంతా ఎందుకని నిర్వాహకులు వారితే సయోధ్య కుదుర్చుంటున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లపైనా పడుతున్నారు. నిజానికి వీరంతా నిజాయితీగా పోరాటం చేస్తే హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. కానీ కేవలం ఆ శాఖ అధికారులు, వార్డెన్లను భయపెట్టి అందినకాడికి సొమ్ముచేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇష్టంలేకపోయినా కొందరు విద్యార్థులు వీరివెంట తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో పాలుపంచుకుని చిక్కుల్లో పడుతున్నారు.
ఉపేక్షించం..
కొందరు వ్యక్తులు జిల్లా అధికారులను, ప్రజలను వేధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా స్వయంగా చూశాను. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా సీఎం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం. కాబట్టి ఇలాంటి బ్లాక్‌మెయిలర్లకు భయపడాల్సిన పనిలేదు. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా వద్దకు నేరుగా వచ్చి ‘స్పందన’ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు.
– డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment