అక్కడంతా ఆమ్యామ్యాలే! | RTA office was placed as corruption | Sakshi
Sakshi News home page

అక్కడంతా ఆమ్యామ్యాలే!

Published Fri, Aug 21 2015 4:08 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అక్కడంతా ఆమ్యామ్యాలే! - Sakshi

అక్కడంతా ఆమ్యామ్యాలే!

- ఇద్దరు ప్రధాన అధికారుల హవా..
- ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే!
- బ్రోకర్ల అండతో యథేచ్ఛగా అవినీతి దందా
- ఆర్టీఏ కార్యాలయం ఎదుటేబ్రోకర్ ఆఫీసులు..
- రోజుకు సుమారు 500 ఫైళ్ల లావాదేవీలు
- నెలకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్జన
సాక్షిప్రతినిధి, అనంతపురం :
‘అనంత’ ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వెహికల్  రిజిస్ట్రేషన్...లెసైన్స్...పనేదైనా బ్రోకర్‌ను సంప్రదించాల్సిందే!  బ్రోకర్‌తో సంబంధం లేకుండా ‘పని’కావాలని మొండిపట్టు పడితే ఆ పని ఎప్పటికి అవుతుందో తెలీదు. అధికారులు కూడా బ్రోకర్ల అండతోనే ఫైళ్ల క్లియరెన్స్... లావాదేవీలు సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ పని కావాలన్నా ప్రభుత్వానికి నికరంగా చెల్లించాల్సిన మొత్తాని కంటే అదనంగా 2-4రెట్లు సమర్పించుకోవాల్సిందే.

ఇద్దరు అధికారుల హవా!
ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్స్‌ల జారీ ముగ్గురు ప్రధాన అధికారుల చేతుల మీద సాగుతోంది. వీరిలో ఇద్దరు ఇక్కడి లావాదేవీలు గుప్పిట్లో పెట్టుకున్నారు. వీరిద్దరి కింద దాదాపు 50 మంది బ్రోకర్లు ఉన్నారు. కార్యాలయం గేటు బయటే వీరి ఆఫీసులు ఉన్నాయి. జీపు, కారు, టాటాఏఎస్, మ్యాజిక్ లాంటి నాలుగుచక్రాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు నిబంధనల ప్రకారం 650 రూపాయలు చలానా ఖర్చు అవుతోంది. నెంబర్ ప్లేటుకు మరో 600 రూపాయలవుతుంది.

అయితే బ్రోకర్లు 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చును చెల్లిస్తారు. తక్కిన డబ్బును మూటగడతారు. ఇలా ఒక్కో బ్రోకర్ రోజుకు దాదాపు రూ.10-13వేల దాకా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. అంటే! ఇక్కడున్న 50 మంది బ్రోకర్లు రోజువారి ఆదాయం 5లక్షలపైమాటే! ఈ మొత్తం సొమ్ము సాయంత్రం అయ్యేసరికి ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు అధికారులకు ఇస్తారు. ఈ ఇద్దరు ఎవరు ఎన్ని ఫైళ్లు తీసుకొచ్చారు? ఎవరి వాటా ఎంతా అనేది తేల్చుతారు? వారు కింది నుంచి పై స్థాయి వరకూ ‘వడ్డి’ంపులు చేస్తారని కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు.
 
ఇంగ్లీషుతోనే అసలు సమస్య!
వాహనదారులు, డ్రైవర్లు పూర్తి చేయాల్సిన దరఖాస్తులన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి. వీటిని పూరించడం చాలామందికి తెలీదు. దీంతో బ్రోకర్లను సంప్రదిస్తారు. వీరు వచ్చిందేతడవుగా బ్రోక్లర్లు ‘మీకెందుకు తిప్పలు, మీరు వెళితే లేనిపోని సాకులు చూపి ఆలస్యం చేస్తారు. పైగా నాలుగైదు రోజులకు బాడుగలు పోతాయి. మాకివ్వండి మేం చేస్తాం’ అని ఆందోళన రేపుతారు. దీంతో వాహనదారులు బ్రోకర్లు సరెండర్ అవుతారు. వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నారు.  

బ్రోకర్లను సంప్రదించకుండా నేరుగా ఫైలు అధికారి వద్దకు వెళితే అడ్డంకులు తప్పవు! దానిపై రాతను పసిగట్టి పక్కనపడేస్తారు. మరీ ఇబ్బంది పడితే మొహమాటం లేకుండా ఆ ఇద్దరి వద్ద ఉన్న అసిస్టెంట్లు రేటు చెప్పేస్తారు. వారు చెప్పినంత కచ్చితంగా ఇవ్వాల్సిందే! లేదంటే ‘గ్రీన్‌ఇంక్’ పెన్ పేపర్‌పై కదలదు. అదే బ్రోకర్ల ద్వారా వచ్చినవి అయితే నిమిషాల్లో పని చేస్తారు. ఇలా బ్రోకర్ల ద్వారా కార్యాలయంలో  రోజుకు దాదాపు 500 ఫైళ్లు నడుస్తున్నట్లు సమాచారం.
 
ఎల్‌ఎల్‌ఆర్‌కూ వసూళ్లే!!
లెసెన్స్‌ల కోసం వెళ్లే డ్రైవర్లు ముందుగా ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోవాలి. ఎల్‌ఎల్‌ఆర్‌కు 120 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇక్కడ మాత్రం అదనంగా 300-500 రూపాయలు చెల్లించాలి. వాహన పరీక్ష (డ్రైవర్ల టెస్ట్)కు వెళితే అక్కడ మరో మూడు వందల రూపాయలు అదనంగా ఇచ్చుకోవాలి. పని పూర్తయిన తర్వాత తీరా లెసైన్స్ చేతికి రావాలంటే అక్కడా చేయి తడపాల్సిందే!! ఈ విధంగా కార్యాలయంలో ఫైలు కదిలే ప్రతీ టేబుల్ వద్ద ముడుపులు తప్పనిసరిగా చెల్లించుకోవల్సిన పరిస్థితి.

కార్యాలయంలోని పరిస్థితిని ఆరా తీస్తే వాహనదారులు, లెసైన్స్ దారులంతా ‘ముడుపులు’ ఇవ్వకపోతే పని కాదని... ఇది ఆర్టీఏ కార్యాలయంలో సర్వసాధారణమైపోయిందని చెబుతున్నారు. దీనిపై ‘సాక్షి’ వాయిస్ అడిగితే వాహనాలు ఉన్నోళ్లం మేం ఆరోపిస్తే... మళ్లీ మా పని అవుతుందా? సార్! అని నిరాకరిస్తున్నారు. అన్నిశాఖల ప్రక్షాళనపై దృష్టి సారించిన కలెక్టర్ కోన శశిధర్ ఆర్టీఏ కార్యాలయం వైపు కూడా దృష్టి సారించాలని ‘మాముళ్ల’ భారం తగ్గించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement