జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. సిబ్బంది చేయాల్సిన పనులకు షోడోలు అడ్డుపడుతున్నారు. పనికి రేట్లను ఫిక్స్ చేసి ప్రజలను దోచేస్తున్నారు. ఈ తంతు మొత్తం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆఫీసులో ఉన్న అవినీతి తిమింగలం నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఒకరేటు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారులు సైతం వారికే వత్తాసు పలకడంతో మిగతా సిబ్బంది చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి దాపురించింది. గుంటూరు కలెక్టరేట్‌లో సైతం ఓ అధికారి డమ్మీగా మారినట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి పలుమార్లు సెలవులో వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం.
గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో..
ఈ కార్యాలయంలో ఓ డీటీ (డిప్యూటీ తహసీల్ధార్)స్థాయి అధికారి హవా నడుస్తోంది. మొత్తం ఆదాయ వనరులుగా ఉన్న సబ్జెక్టులు అతని వద్దనే ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారికి అతను చెప్పిందే వేదం. కార్యాలయంలో ఉండే సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో కూడా పాలన గాడితప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తహసీల్ధార్ కార్యాలయం..
ఇక్కడ వివిధ హోదాల్లో ఓ అధికారి తిష్ట వేసి, ఇష్టారాజ్యంగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి తక్కెళ్ల పాడులో అసైన్డ్ భూములకు దొంగపట్టాలు ఇవ్వటంలో సదరు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. గతంలో తాను చేసిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు ఈ కార్యాలయంలోనే ఉండేలా అధికార పార్టీనేతలను ఆశ్రయించి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం.
తెనాలి ఆర్డీఓ ఆఫీసులో అన్నీ తానై...
తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి పెత్తనానికి అడ్డుఅదుపు లేకుండా పోయిం దని అక్కడి ఉద్యోగులే విమర్శిస్తున్నారు. కార్యాలయ అధికారిని కాదని, ప్రతి వ్యవహారంలో తలదూర్చి, పనికి రేట్లు ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలతో జిల్లాకు చెందిన ఓ మంత్రి బదిలీ సిఫారసు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలకార్యాలయాల్లో తహసీల్ధార్ రాసే రిపోర్టులకు సైతం కొర్రీలు వేసి, వాటిని ఆయనే తయారు చేసి డబ్బులు గుంజుతున్నట్లు చర్చ జరగుతోంది.
డీటీలు దండుకుంటున్నారు..
నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఓ డీటీ కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కార్యాలయంలో ఉన్న అధికారి, డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఎక్కడున్నారో చెప్పలేని దుస్థితి. గతంలో రెవెన్యూ ఇన్పెక్టర్‌గా ఆ డివిజన్‌లోనే పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం భూ వ్యవహారాల సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గురజాలలో గుంజుడెక్కువ..
గతంలో అధికార పార్టీ నాయకుడి వెంట తిరిగిన ఓ అధికారి ప్రస్తుతం వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు. ఇతనిపై ఏసీబీ దాడులు జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉడటంతో ఉన్నతాధికారి సదరు అధికారిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమాంతర వ్యవస్థ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఈ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment