ఇసిగెత్తిపోతున్న ఇమానాల మంత్రి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారులా... బ్రోకర్లా!: గతంలో మాదిరి గా వ్యవహరించొద్దు. షాడో నేతను గుర్తుకు తెచ్చేలా నడవొద్దు. అధికారులై ఉండి బ్రోకర్లుగా ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్లడం సిగ్గు అన్పించలేదా? అటువంటివి జరిగితే సహించను. ఏం మీరు బొట్టుపెట్టలేరా?: రామతీర్థంలో రాములవారిని దర్శించుకున్న అనంతరం బొట్టు పెట్టుకోమని అర్చకులు కుంకుమ భరిణి అందించినప్పుడు అసహనంతో చిందులు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఉత్తర రాజగోపురం వద్దకు వచ్చేటప్పటికీ బేడాలో దేవస్థానానికి చెందిన సామాన్లు అడ్డుగా ఉండడాన్ని చూసి ఆలయ అధికారులపై శివాలు.
మున్సిపల్ ఇంజనీరా...మంగలి వాడా!: ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో క్లోరినేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేయడం శాస్త్రీయం కాదు. ఇదే తరహాలో ముషిడిపల్లి రక్షిత మంచినీటి పథకం వద్ద ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే కనీసం పట్టించుకోలేదు.
ఇదేనా ప్రజాప్రతినిధుల మాటలకిచ్చే గౌరవం అంటూ మండిపాటుపునరావృతమైతే సహించను: ఆదివారం ఉదయం 7.30గంటలకు ప్రొగ్రామ్ ఉందని ముందుగా చెప్పినా అధికారులు ప్రోటోకాల్ వాహనం ఏర్పాటు చేయలేదు. ఆగ్రహాన్ని ఆపుకోలేక తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని సొంతవాహనంలో విశాఖపట్నం ప్రయాణం. అసలు విషయం తెలుసుకుని ఆర్డీఓ హుటాహుటిన వచ్చి ఎంత విజ్ఞప్తి చేసినా ప్రభుత్వ వాహనాన్ని స్వీకరించేందుకు ససేమిరా.... ఆయనపైనా ధ్వజం. కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి ఆగ్రహం. పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక.ఇలా ఒక వైపు జిల్లా అధికారులను, మరో వైపు పార్టీ నేతలను హడలెత్తిస్తూ...అసహనాన్ని వెళ్లగక్కుతూ ఇంతగా మండిపడుతున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరో తెలుసా.... ఇంతవరకూ అధికార ఆర్భాటాలకు, నీచ రాజకీయాలకు దూరంగా ఉంటారని, చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోరని పేరున్న అశోక్ గజపతిరాజు.
కేంద్ర మంత్రి అయిన తరువాత మారిన తీరు
గత పదేళ్లు అధికారంలో లేమన్న అక్కసో, గత ప్రభుత్వంలో అధికారులు తమను పట్టించుకోలేదన్న ఆక్రోశమో తెలియదు గానీ కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారులపై చిర్రెత్తుతున్నారు. గతాన్ని గుర్తు చేసుకుని చిన్నదానికే శివతాండవం చేస్తున్నారు. ఇన్నాళ్లూ అణుచుకున్న ఆగ్రహంతో ఇప్పుడు శివాలెత్తుతున్నారు. అనుమానిస్తూ మాట్లాడుతున్నారు. తప్పు చేసినవాళ్లూ, చేయని వాళ్లపై ఒకేలా మండి పడుతున్నారు. అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తున్నట్టు ప్రతి విషయంలో షాడో నేతను గుర్తు చేయడంతో అధికారులు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకుంటున్నారు. తామెవరమూ ఆ నేతను కలవలేదని, ఆయన ఇంటికి వెళ్లలేదని ఒట్టేసే విధంగా చెప్పుకుంటున్నారు. అశోక్ పర్యటన అంటేనే వణికిపోతున్నారు. ఆయనొస్తే ఎలాంటి మాటలు విసిరేస్తారోనని అభద్రతాభావానికి లోనవుతున్నారు.
పార్టీ నేతలపైనా....
అధికారులపైనా, పాలనా వ్యవస్థపైనా ఉన్న కోపాన్ని చివరికి తమ పార్టీ నేతలపైనే చూపిస్తున్నారు. పార్టీజెండాను మోసి, తన గెలుపును భుజానకెత్తుకున్న నాయకులని కూడా చూడకుండా మండి పడుతున్నారు. తన వెంటే ఉండి, కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన నాయకులపైనా శివాలెత్తుతున్నారు. ఆదివారం రాత్రి అదే జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ అశోక్ బంగ్లాలో సుమారు 400మంది నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీకి అందించిన సేవల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవి ఇస్తే గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని నాయకులంతా ఒక అభిప్రాయానికొచ్చారు. ఇదే విషయాన్ని అశోక్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఇంకేముంది ఆయన చిర్రెత్తిపోయారు. ‘పార్టీకి క్రమశిక్షణ ఉందని, పార్టీలో పద్ధతులున్నాయని, ఎవరికి పడితే వారికి ఇచ్చేయడానికి కుదరదని, ఐవీపీరాజుకి మంచి చేస్తున్నారో, చెడ్డ చేస్తున్నారో తెలియడం లేదు’ అంటూ విసుక్కున్నారు. పార్టీ పరమైన విషయాలను వదిలేసి వీటికోసం మాట్లాడడమేంటని మండిపడ్డారు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా కసురుకున్నారు. దీంతో సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు అవమాన భారంతో బయటికొచ్చి, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుకున్నారు. కష్టపడిన వారికి పదవులు అక్కర్లేదా అని ప్రశ్నించుకోవడమే కాకుండా,
ఐవీపీ రాజుకిచ్చిన గౌరవమిదేనా అని గుసగుసలాడుకుంటున్నారు. అందరి మధ్య ఐవీపీ రాజు గురించి ఇలా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆయనకు ఎవరు గౌరవిమిస్తారని చర్చించుకున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలంతా అశోక్ తీరుతో నిర్వేదం చెందుతున్నారు. ఈ విధంగా అటు అధికారులతోను, ఇటు పార్టీ నాయకులతోను అశోక్ కోపావేశంతో మాట్లాడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏదో చేస్తారనుకుంటే ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారని మధనపడుతున్నారు.