జిల్లాల్లో జోరుగా కోతలు.. ఏర్పాటుకాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో పది రోజుల క్రితం నుంచేవ్యాపారుల కొనుగోళ్లు
నేరుగా రైతుల నుంచి అగ్గువకు కొనుగోలు చేసి మిల్లులకు విక్రయం
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి.
ఉమ్మడి నిజామాబాద్‌లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు
ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్‌మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్‌పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు.
మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్‌మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్‌కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు.
పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్‌కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు.
ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు
యాసంగి సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment