సెబీ సంస్కరణల జోష్‌! | Sebi board approves lowering of fees for brokers, exchanges | Sakshi
Sakshi News home page

సెబీ సంస్కరణల జోష్‌!

Published Sat, Mar 2 2019 12:42 AM | Last Updated on Sat, Mar 2 2019 3:56 AM

Sebi board approves lowering of fees for brokers, exchanges - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ, క్యాపిటల్‌ మార్కెట్లను మరింత బలోపేతం, విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డు (సెబీ) శుక్రవారం నిర్ణయాలు తీసుకుంది. ట్రేడింగ్‌ చార్జీల భారాన్ని తగ్గించడం నుంచి స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లను అనుమతించడం వరకు ఎన్నో కీలక నిర్ణయాలను వెలువరించింది. స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ను మరింత చౌకగా మార్చే దిశగా ఫీజులను భారీగా తగ్గించింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కోసం కంపెనీల నుంచి తీసుకునే ఫీజులను కూడా తగ్గించింది. సెక్యూరిటీస్‌ మార్కెట్‌పై లావాదేవీల రుసుములు, నియంత్రణపరమైన సమర్థత కోసం అవసరమైన ఆదాయ వనరుల మధ్య సమతుల్యత కోసం ఫీజులను పెంచడం లేదా తగ్గించడాన్ని సమయానుకూలంగా సవరించనున్నట్టు సెబీ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, ఖర్చుల అంచనాలను పరిగణనలోకి తీసుకుని 2019 ఏప్రిల్‌ 1 నుంచి ఫీజులను సవరించినట్టు వెల్లడించింది.

►బ్రోకర్లు చెల్లించే ఫీజులను 33.33 శాతం తగ్గించింది. దీని ప్రకారం కోటి రూపాయల లావాదేవీల విలువపై రూ.15 చార్జీ కాస్తా రూ.10కి తగ్గింది. 
► వ్యవసాయ ఉత్పత్తుల (అగ్రి కమోడిటీలు)పై ఫీజును ఏకంగా 93.33 శాతం తగ్గించింది. రూ.కోటి విలువ లావాదేవీలపై చార్జీని రూ.15 నుంచి రూ.1 చేసింది. 
► కస్టోడియన్లకు ఏటా రెన్యువల్‌కు బదులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. 
►స్టాక్‌ ఎక్సేంజ్‌లు చెల్లించే రెగ్యులేటరీ ఫీజును 80 శాతం తగ్గించింది. ప్రస్తుతం రూ.10 కోట్లపైన టర్నోవర్‌కు కోటి రూపాయలకు రూ.6 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉండగా, దీన్ని రూ.1.20కు తగ్గించింది.  
►  ఆఫర్‌ డాక్యుమెంట్ల రీఫైలింగ్‌పై ఫీజును 50 శాతం తగ్గించింది. పరిశీలన లెటర్‌ జారీ చేసిన నాటి నుంచి ఏడాది లోపు రీఫైలింగ్‌కు ఇది వర్తిస్తుంది. 
►డిబెంచర్‌ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా డిబెంచర్‌ ట్రస్టీలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను, కనీస నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచింది. చెల్లింపుల్లో విఫలమైతే డిబెంచర్‌ హోల్డర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

కమోడిటీ డెరివేటివ్స్‌లోకి మ్యూచువల్‌ ఫండ్స్‌...
కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌కు మ్యూచువల్‌ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌)ను అనుమతిస్తూ సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లోకి అనుమతించాలన్న కమోడిటీ డెరివేటివ్స్‌ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ను కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లోకి ఇప్పటికే అనుమతిస్తుండగా... డెలివరీ విధానంలో తీసుకునే గూడ్స్‌లో డీలింగ్‌కు కూడా అనుమతించింది. రెండో దశలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్‌ కంపెనీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను సైతం అనుమతించాలని అడ్వైజరీ కమిటీ సూచించింది. సెబీ గుర్తించిన సున్నితమైన కమోడిటీలు కాకుండా, ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ కమోడిటీల్లో ట్రేడింగ్‌కే అనుమతింనునున్నారు. 

ఫండ్స్‌ వ్యాల్యుయేషన్‌లో పారదర్శకత
ఇక, మనీ మార్కెట్, డెట్‌ సెక్యూరిటీల విలువను నిర్ణయించడానికి సంబంధించిన నిబంధనలను సెబీ సవరించనుంది. పరిశ్రమ అంతటా ఒకే రీతిలో ఉండే విధంగా, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ తరహా రుణ చెల్లింపుల వైఫల్యాల నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ  కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. యాంఫి నియమించిన వ్యాల్యుయేషన్‌ ఏజెన్సీలు మనీ మార్కెట్, డెట్‌ సెక్యూరిటీలకు వ్యాల్యుయేషన్‌ ఖరారు చేస్తారు. పారదర్శక విలువ విషయంలో ఏఎంసీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాల్యూషన్‌ ఏజెన్సీలు సూచించిన వ్యాల్యూషన్లకు అనుగుణంగా లేకపోతే అందుకు సంబంధించిన వివరాలను ఏఎంసీ బోర్డు, ట్రస్టీలు, ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. 

కామెక్స్‌ టెక్నాలజీపై ఐదేళ్ల నిషేధం
గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్‌) ఇష్యూలో అవకతవకలకు పాల్పడ్డందుకు కామెక్స్‌ టెక్నాలజీపై ఐదేళ్లు, ఆ సంస్థకు చెందిన మాజీ డైరెక్టర్లు ఆది కూపర్, కిషోర్‌ హెగ్డేలపై రెండేళ్లపాటు సెబీ నిషేధం విధించింది. 2009 మే 25న 1.91 మిలియన్ల జీడీఆర్‌లను (9.99 మిలియన్ల డాలర్ల విలువ) సంస్థ జారీ చేసింది. 

సెబీకి జైట్లీ ప్రశంసలు
దేశీయ సెక్యూరిటీస్‌ మార్కెట్ల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యల విషయంలో సెబీ బోర్డు, సీనియర్‌ అధికారులు నిర్వహించిన పాత్రను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అభినందించారు. ఈ విషయాన్ని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది. 

స్టార్టప్‌లో పెట్టుబడులిక సులువు
స్టార్టప్‌ కంపెనీల లిస్టింగ్‌ను సెబీ సులభతరం చేసింది. నూతన తరం స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారి గుర్తింపు నిబంధనలను సులభతరం చేసేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. సెబీ ఆమోదించిన కార్యాచరణ ప్రకారం... డీమ్యాట్‌ అకౌం ట్‌ ఉన్న ఇన్వెస్టర్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ లేదా డిపాజిటరీల ద్వారా అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు, డిపాజిటరీలు ఇన్వెస్టర్లకు మూడేళ్ల కాలానికి గుర్తింపు (అక్రిడేషన్‌) ఇస్తాయి. అక్రిడేటెడ్‌ ఇన్వెస్టర్ల అర్హతకు సంబంధించి పూర్తి నిబంధనలను సెబీ తర్వాత నోటిఫై చేయనుంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు... వార్షికంగా రూ.50 లక్షల స్థూల ఆదాయం ఉన్న వారు, కనీస లిక్విడ్‌ నెట్‌వర్త్‌ రూ.5 కోట్లు ఉన్నవారికి అక్రిడేషన్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  

ఓపెన్‌ ఆఫర్‌ నిబంధనల సడలింపు
కార్పొరేట్‌ రుణ పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించి ఓపెన్‌ ఆఫర్‌ నిబంధనలను సెబీ సడలించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకే ఇది వర్తిస్తుంది. దీంతో రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి సంస్థలకు ఇది ఉపశమనం కల్పించనుంది. సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం.. లిస్టెడ్‌ కంపెనీలో నియంత్రిత వాటా లేదా 25% వాటాను తీసుకుంటే, మైనారిటీ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దీన్నుంచి సెబీ మినహాయింపునిచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు రూ.8,000 కోట్ల రుణాలను ఇవ్వగా, వాటిని చెల్లించలేని పరిస్థితుల్లో వాటా కింద మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇవి ఓపెన్‌ ఆఫర్‌ నిబంధనల మినహాయింపుపై సెబీ నుంచి స్పష్టత కోరాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement