ఆదోని, న్యూస్‌లైన్: అరకొర దిగుబడులతో నష్టాలు మూటగట్టుకున్న వేరుశెనగ రైతులను కొంతైనా ఆదుకునే ఉద్దేశంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కూడా దళారులు చేతివాటం చూపుతున్నారు. రైతుల పేరుతో ఉత్పత్తులను ఆయిల్ ఫెడ్‌కు తరలించి అక్కడి సిబ్బంది సహకారంతో సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ దారిన కాకుండా సొంతంగా ఉత్పత్తులు తీసుకెళ్లిన రైతులకు వద్ద నిరీక్షణ తప్పడం లేదు. వేరుశెనగకు గిట్టుబాటు లేకపోవడాన్ని దృష్టిలో ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించింది. ఆదోని, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే కేంద్రంలోని కొందరు సిబ్బందితో చేతులు కలిపి మాకింత, మీకింత ఒప్పందంతో దళారులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు.
మామూళ్లు ఇచ్చిన వారికే ఫలితాలు
ఆదోనిలో దళారీల సిఫారస్‌తో వచ్చిన వారి ఉత్పత్తుల కొనుగోళ్ల చురుగ్గా సాగిపోతున్నాయి. కొందరు కమీషన్ ఏజెంట్లు రైతులతో ఓ ధరకు మాట్లాడుకుని ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలిస్తున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం, తహశీల్దారు ధృవీకరణ పత్రాలను రైతులే తెస్తున్నారు. రూ. 3400కులోపుగా మాట్లాడుకుని వెంటనే డబ్బులు ఇస్తున్నారు.
తర్వాత వాటిని అయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడి సబ్బంది సహకారంతో రూ.4వేలకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని అనధికార సిబ్బందికి రూ.150 నుంచి రూ.200 వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇలా ఆదివారం కొందరు ఏజెంట్లు 200 క్వింటాళ్ల వరకు ఆయిల్‌ఫెడ్ కేంద్రంలో అమ్మినట్లు తెలిసింది.
రోజుల తరబడి నిరీక్షించినా...
వేరుశనగసాగుతో మూట కట్టుకున్న నష్టాలను ఆయిల్ ఫెడ్ కేంద్రంలో అమ్ముకుని కొంతైనా పూడ్చుకుందామన్న ఆశతో వచ్చిన రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వీఆర్‌ఓ, తహశీల్దారు ధృవీకరణ పత్రాల కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రంలో శాంపిల్స్ చూపించి తెచ్చే తేదీని నిర్ణయించేందుకు మరో రోజు పడుతోంది. తెచ్చిన తర్వాత మూడు రోజులకు కూడా అమ్మక ం కావడం లేదు. అదే దళారీల ద్వారా వెళ్తే సులువుగా కొనుగోళ్లు సాగిపోతున్నాయి.
ఎందుకీ పరిస్థితి..
మార్కెట్‌లో క్వింటా ధర రూ. 3500 మించి పలుకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్దతుధర(రూ.4వేలు)తో 1.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు విధించడంతో రైతులు అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. ఆదోనిలో సోమవారం వెయ్యి క్వింటాళ్ల వరకు రైతులు కొనుగోలుకు ఉంచినట్లు అంచనా.
చేయి తడిపితేనే.. ‘పంట’
Published Tue, Jan 21 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement