ధర తఖరారు
సాక్షి, అనంతపురం : గత ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన వేరుశనగను ప్రభుత్వం మూడు నెలల కిందట క్వింటాలు రూ.4 వేలు ప్రకారం నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుండటంతో వేరుశనగ వేసేందుకు రైతులు దుక్కి దున్ని సిద్ధమవుతున్నారు. సబ్సిడీ పేరుతో ప్రస్తుతం క్వింటాలు రూ.4,600 ప్రకారం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్, హాకా, మార్క్‌ఫెడ్ సంస్థలు మాత్రం ఆ ధర మేరకు పంపిణీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. క్వింటాలుకు మరో వెయ్యి రూపాయలు అదనంగా చెల్లిస్త్తే గానీ తాము సరఫరా చేయలేమని ఆయా సంస్థల అధికారులు తెగేసి చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తారు. రెండు మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి సరిగా రాకపోవడంతో చాలా మంది రైతులు వేరుశనగను సాగు చేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది 18 నుంచి 20 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీటికి దాదాపు 10 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరమవుతుంది. అయితే ఈ ఏడాది 3.5 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేసినా రైతుల వద్ద డబ్బులు లేక పెద్దగా నిలువ ఉంచుకోలేదు.
ఈ ఏడాది మాత్రం విత్తన కాయలు కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల తర్వాత సబ్సిడీ మొత్తం ఇస్తామని అధికారులు చెబుతుండటంతో రైతులు ఎవ్వరూ నమ్మడం లేదు.అధికారం ఇస్తే రైతులను ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం గురించి నోరు మెదపడం లేదు. రైతు క్వింటాలు రూ.4,600కు కొనుగోలు చేసిన తర్వాత 33 శాతం సబ్సిడీ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా విత్తన వేరుశనగ సేకరణ మొదలే కాలేదు. ఈ నెల 26 నాటికి కనీసం 50 వేల క్వింటాళ్ల మేరకు సేకరించి గోడౌన్లలో సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. మూడు నెలల కిందట రైతులు పండించిన వేరుశనగను నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు క్వింటాలు రూ.4 వేలు ప్రకారం కొనుగోలు చేసినా వాటిని శుద్ధి చేసి విత్తనం కోసం తిరిగి విక్రయించాలంటే కనీసం రూ.5,600 ధర చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని భీష్మించుకుని కూర్చున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సంస్థలతో జిల్లా అధికారులు సంప్రదింపులు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఈ సారి విత్తన వేరుశనగ అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు ఇటీవల రైతుల నుంచి కొనుగోలు చేసిన 1.42 లక్షల క్వింటాళ్ల వేరుశనగ గోడౌన్లలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని ఆ కంపెనీలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం 75 శాతం మంది రైతుల వద్ద విత్తన వేరుశనగ అందుబాటులో లేదు. అందరూ సబ్సిడీ విత్తనంపైనే ఆధారపడ్డారు. జిల్లాలో జూన్ 25లోపే వేరుశనగ వేస్తే అధిక దిగుబడులు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తర్వాత సాగు చేసినా... వర్షాలు సకాలంలో వచ్చినా దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు వస్తే సకాలంలో విత్తనం వేసేందుకు వీలుగా విత్తన వేరుశనగను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.