సాక్షి, కడప: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.. సబ్సిడీలతో వ్యవసాయాన్ని పండుగలా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే పెద్ద రైతుల పేరుతో సబ్సిడీకి శఠగోపం పెట్టారు. రైతు రుణమాఫీ ప్రకటనతో ‘దేశం’ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో అదరగొట్టినా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రుణమాఫీ కాకపోవడంతో రైతులలో టీడీపీ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ స్తోంది.
రుణమాఫీ, డ్వాక్రా రుణాల విషయంలో బాబు మాట తప్పారంటూ మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేద రైతులతో పని లేకుండా పెద్ద రైతులకు మాత్రమే సబ్సిడీ కోత పెడుతున్నామని సర్కార్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితులలో రైతులందరూ కష్టాలలో ఉన్నారని చెప్పక తప్పుడు. కరువు పరిస్థితులు నెలకొని పంటలు సాగుకాక అల్లాడిపోతున్న అన్నదాతకు భారీ సబ్సిడీతో పరికరాలు అందించాల్సిన ప్రభుత్వం పెద్ద రైతుల పేరుతో సబ్సిడీకి కత్తెర పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
వైఎస్‌ఆర్ హయాంలో భారీగా సబ్సిడీ
దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో ఉద్యానవన పంటలు సాగు చేసిన రైతులకు తుంపర, బిందుసేద్యం పరికరాలను భారీ సబ్సిడీతో అందిస్తూ వచ్చారు. చిన్న, సన్న, కౌలు అనే తేడా లేకుండా అందరికి 90 శాతం సబ్సిడీతో స్ప్రింకర్లు, డ్రిప్పు పరికరాలను వైఎస్‌ఆర్ సర్కార్ అందిస్తూ వచ్చింది. జిల్లాలో 2004-09 మధ్య 50 వేల హెక్టార్ల వరకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించడంలో వైఎస్‌ఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారనే విషయం ఇట్టే అర్థమవుతోంది.
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగానే అందిస్తూ ప్రభుత్వమే సబ్సిడీని భరిస్తూ వచ్చింది. వైఎస్‌ఆర్ హయాంలో ఐదెకరాల కన్నా ఎక్కువ కలిగిన రైతులకు 75 శాతం వరకు సబ్సిడీ కల్పిస్తూ వచ్చారు. 2004-05 నుంచి ఇప్పటి వరకు దాదాపు 81,965 హెక్టార్లకు బిందు, తుంపర పరికరాలు అందించారు.
పెద్ద రైతులకు సబ్సిడీలో కోత
టీడీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అంతే.. రైతులపై ప్రయోగం మొదలు పెట్టారు. 5 ఎకరాలలోపు భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తూనే మరో వైపు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు సబ్సిడీలో కోత విధించారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు కేవలం 50 శాతం సబ్సిడీ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఎకరాకు డ్రిప్ పరికరాలకు సరాసరి రూ. 18 వేలు ఖర్చవుతుంద నుకుంటే పెద్ద రైతులకు దాదాపు 9 వేల వరకు ఖర్చు వస్తుంది. సూక్ష్మ సేద్యం పరికరాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
10,619 హెక్టార్లలో లక్ష్యం :
జిల్లాలో 2014-15కు సంబంధించి 10,619 హెక్టార్ల లక్ష్యంగా నిర్ణయించినట్లు ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి కలిగిన రైతుల విషయంలో ప్రభుత్వ సబ్సిడీపై నిర్ణయం త్వరలోనే వెలువడుతుందన్నారు.
- శ్రీనివాసులు, పీడీ
ఇదీ ‘బాబు’ మార్క్ సబ్సిడీ..!
Published Wed, Sep 10 2014 2:24 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement