ఇంతకన్నా నమ్మకద్రోహం ఉండదంటున్న ఏపీ రైతాంగం
విజయవాడ బ్యూరో: తొలి సంతకం రుణ మాఫీపైనే అంటూ ఆర్భాటాలు పలికిన తెలుగుదేశం సర్కారు దీనిపై ఆది నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. మాఫీకి నోచుకోక, కొత్త రుణాలు రాక ఖరీఫ్ సీజన్‌ను నష్టపోయిన రైతాంగం రబీ సీజన్‌నూ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల 14వేల కోట్లు మినహాయించగా రైతాంగం తీసుకున్న పంట రుణాల విలువే 87వేల కోట్లు. ఇది రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) అధికారికంగా తేల్చిన లెక్క. దీనిలో ఇప్పటిదాకా పైసా కూడా బ్యాంకులకు చెల్లించకుండా వచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం... రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, దానికి నిధులు కేటాయించి దానిద్వారా మాఫీ చేస్తామని ప్రకటించింది. మంగళవారం నుంచి విజయవాడ కేంద్రంగా పని ప్రారంభించనున్న ఈ సంస్థకు తొలివిడతగా రూ.5వేల కోట్లు కేటాయించారు.
వీటిద్వారా 20 శాతం రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 87 వేల కోట్లలో 20 శాతమంటే 17,400 కోట్లు కాదా! మరి 5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని మాఫీ చేస్తున్నామంటే ఏమనుకోవాలి? పెపైచ్చు ఏడాదిలో రుణాలు తిరిగి చెల్లించలేదు కాబట్టి ఆ 87 వేల కోట్లపై 14 శాతం వడ్డీ చెల్లించాలి. అంటే వడ్డీ రూపేణాయే రూ.12,180 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. అలాంటిది వడ్డీలో సగం కూడా లేకుండా రూ.5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని తొలి ఏడాది మాఫీ చేసేస్తున్నామని, మిగిలిన రుణాల్ని తరవాత మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు రైతులెలా నమ్ముతారు? ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? రానురాను ఈ వడ్డీ పెరిగి రైతులకు పెనుభారం కాదా?
నేడు సాధికార సంస్థ ప్రారంభం
విజయవాడలోని గన్నవరం ఎన్‌టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని లైవ్‌స్టాక్ భవనంలో ఏర్పాటు చేస్తున్న రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 11.50కి ప్రారంభిస్తారు. తర్వాత కళాశాల ఆవరణలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు.
వడ్డీకే చాలని నిధులతో 20 శాతం మాఫీయా?
Published Tue, Oct 21 2014 2:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement