ఆశలపై నీళ్లు
పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన రైతన్నను బుట్టలో వేసుకునేందుకు బాబు వేసిన రుణ మాఫీ పాచిక పారింది. అరచేతిలో వైకుంఠం వారిని బోర్లా పడేసింది. అప్పులు తీరిపోతాయని.. కష్టాలు గట్టెక్కుతాయని భావించిన రైతన్న ఆశ చంద్రబాబు ప్రమాణ స్వీకారం సాక్షిగా ఆవిరైంది. ఖరీఫ్ మేఘం కమ్ముకొస్తుండగా.. పెట్టుబడి కష్టాలు తరుముకొస్తుండగా.. కొత్త సీఎం రుణ మాఫీపై కమిటీ వేసి చేతులు
దులుపుకోవడం వెన్నుపోటు కాక మరేమిటి.
ఇదెక్కడి విడ్డూరం రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు కమిటీ వేస్తున్నట్లు చెప్పడం సమంజసం కాదు. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడులను సమకూర్చుకునేందుకు రైతులు అల్లాడుతున్నారు. ముందస్తు అవగాహన లేకుండా ఎన్నికల మేనిఫెస్టోలో రుణ హామీ ఎందుకు చేర్చినట్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మభ్యపెట్టడం తగదు. బ్యాంకుల్లో రైతులు రుణాలు తీర్చే వరకు కొత్తగా అప్పులిచ్చే పరిస్థితి లేదు. కమిటీ నివేదిక ఇచ్చేందుకు 45 రోజుల గడువిచ్చారు. అప్పటికైనా అమలు చేస్తారనే నమ్మకమేంటి. తొలి సంతకంతో ఇంతటి దారుణానికి ఒడిగడతారని కలలోనైనా ఊహించలేదు.
- బంగారురెడ్డి, రైతు సంఘం నాయకుడు, నంద్యాల
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల ముందు నుంచి ఊరించిన రుణ మాఫీ చుట్టూ నీలినీడలు కమ్మేస్తున్నాయి. స్పష్టమైన హామీతో రైతులను మభ్యపెట్టి అధికారం చేపట్టిన చంద్రబాబు.. గద్దెనెక్కగానే తన అసలు రూపం బయటపెట్టారు. మొదటి సంతకం చేసినట్లే చేసి.. మాఫీ అమలుపై విధివిధానాల ఖరారు పేరిట కమిటీ వేస్తున్నట్లు ప్రకటించడం రైతుల్లో గుబులు రేపుతోంది. ఖరీఫ్ సీజన్ మొదలైంది.. పత్తి సాగు ముమ్మరమవుతోంది.. ఈ తరుణంలో బాబు నిర్ణయాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవ్వరూ రుణాలు చెల్లించొద్దు.. అధికారం చేపట్టగానే అన్నింటినీ రద్దు చేస్తానని ప్రకటించిన ఆయన.. అంతలోనే మెలిక పెట్టారు.
ఆయనపై నమ్మకంతో గత ఏడాది తీసుకున్న పంట రుణాలతో పాటు.. ఇతర వ్యవసాయ రుణాల చెల్లింపులను రైతులు వాయిదా వేసుకున్నారు. రైతులెవ్వరూ రుణాలు చెల్లించకపోవడంతో పంట రుణాల పంపిణీకి బ్యాంకర్లు సైతం ససేమిరా అంటున్నారు. ప్రమాణ స్వీకారానంతరం బాబు రుణ మాఫీపై కమిటీ వేయడం.. నివేదిక ఇచ్చేందుకు 45 రోజుల గడువు విధించడంతో రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. నివేదిక వచ్చే వరకు ఆగితే పెట్టుబడి ఎలాగనే సమస్య వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు బ్యాంకర్లు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తుండటం గమనార్హం.
జిల్లాలో 2014 మార్చి 31 నాటికి బకాయిపడిన వ్యవసాయ రుణాలు రూ.4,344.13 కోట్లు. ఇందులో 4,62,156 పంట రుణాల అకౌంట్లకు సంబంధించి రూ.2,819.97 కోట్లు.. బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న 56,300 అకౌంట్లకు సంబంధించి రూ.315.21 కోట్లు.. వ్యవసాయ టర్మ్ లోన్లు 89,932 అకౌంట్లకు రూ.1,092.75 కోట్ల బకాయి పేరుకుపోయింది. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు వీటన్నింటినీ మాఫీ చేయాల్సి ఉండగా.. భారం తగ్గించుకునేందుకే కమిటీ వేసినట్లు చర్చ జరుగుతోంది.
ఉద్దేశపూర్వకంగా రైతులను మోసగించేందుకే ఆయన ఇలా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు వ్యవసాయ రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు ఇప్పించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గత ఏడాది జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో 11 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లో ఆరు లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 6.50 లక్షల మంది రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. చంద్రబాబు నిర్ణయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరంతా ఇప్పుడు సంశయంలో పడ్డారు. బాబు నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా.. నిర్ణయం మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
చేతిలో చిల్లిగవ్వ లేదు
చంద్రబాబు పాలన ఏంటో ప్రమాణ స్వీకారం రోజే అర్థమైంది. గతంలో వ్యసాయమే దండగన్న ఆయన ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత మాట మార్చడం సరికాదు. ఖరీఫ్ మొదలైంది. విత్తనాలు, ఎరువులు కొనాలి. ఇంతవరకు చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకుల్లో అప్పులు రద్దయితే కొత్త రుణంతో పంట సాగు చేసుకోవచ్చని సంబరపడ్డాం. తీరా 45 రోజుల గడువంటే ఎట్టా సచ్చేది. - యల్లారెడ్డి, లాన్‌మాన్‌పల్లె, క్రిష్ణగిరి మండలం
గందరగోళం తగదు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు మెలిక పెట్టడం సమంజసం కాదు. కమిటీ వేయడం చూస్తే రుణ మాఫీ అమలు కష్టమేననిపిస్తోంది. రైతుల ఇబ్బందులు తెలిసిన నాయకుడైతే బేషరతుగా రుణ మాఫీ అమలు చేయాలి. ఈ తంతు చూస్తే బ్యాంకుల్లో కొత్తగా రుణాలు ఇవ్వడం అనుమానమే.
- వెంకటేశ్, రైతు, హొళగుంద