రైతురుణంపై ఎందుకీ దొంగ రణం | Extent to chandrababu on the side of the farmer loan | Sakshi
Sakshi News home page

రైతురుణంపై ఎందుకీ దొంగ రణం

Published Sun, Jul 13 2014 1:44 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

రైతురుణంపై ఎందుకీ దొంగ రణం - Sakshi

రైతురుణంపై ఎందుకీ దొంగ రణం

అధికారం అందని ద్రాక్షే అనుకుంటున్న సమయంలో ఇలాంటి హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు ఎదుట ఇప్పుడున్న పెద్ద సవాలు- తను ఇచ్చిన హామీలను నీరు గార్చడం ఎలా? అన్నదే.
 
రైతు రుణమాఫీ హామీతోనే 2014 సాధారణ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్నది వాస్తవం. ఇప్పుడు ఆ పథకం అమలు విషయంలో ఆయన చేస్తున్న తాత్సారం, వేస్తున్న కుప్పిగంతులు అత్యధికులను ఏమాత్రం ఆశ్చర్యం కలిగించవన్నది కూడా అంతే వాస్తవం. ఈ హామీలోని సాధ్యాసాధ్యాలను ప్రజలు ముందే అంచనా వేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ వ్యవసాయం మీద, వ్యవసాయా ధారిత రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నవారు 65 శాతానికి మించి ఉన్నారు. పల్లెలలో జరిగే రోజువారీ కార్యక్రమాలలో 75 శాతం ఆ రంగాల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. వారి ఆర్థిక స్వావలంబన మొత్తం ఆ రంగం మీదే ఆధారపడి ఉంది. దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతుల సేవ వెలకట్టలేనిది. ప్రభుత్వాలు వారికి ఎంత చేసినా తక్కువే. కానీ చాలా రాజకీయ పార్టీలు రైతులను రాజకీయ చదరంగంలో పావులుగా మాత్రమే చూస్తున్నాయి.

ఎలాంటి మార్గంలో అయినా సరే, పదవులను అంటిపెట్టుకుని ఉండడమే చంద్రబాబు జీవిత పరమావధి. కాబట్టి సహజంగానే రైతు రుణమాఫీ వంటి ఆలోచనను ఆయన సుదూరంగా ఉంచుతారు. కానీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో, ఇక తట్టుకోలేక వంధి మాగధులతో కలిసి ఇలాంటి పథకాలను ఆశ్రయించారు. వ్యవసాయం దండుగ అన్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి మనిషి రూ. 85,000 కోట్లు పైబడి రైతుల రుణమాఫీ పథకానికి అట్టహాసంగా హామీ ఇచ్చారు. ఇది ఆయనకు మాత్రమే చెల్లిన విద్య. ఇలాంటి గందరగోళ స్థితి నుంచి, ఆయనలో వేళ్లూనుకుని ఉన్న సంస్కరణల దృష్టికి భిన్నంగా పుట్టుకొచ్చిందే రైతు రుణమాఫీ. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినపుడు ఆ వ్యయం రూ. 5,000 కోట్లు. దానిని ఎద్దేవా చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అంతకు పాతిక రెట్లు మేర భారం పడే విధంగా హామీలు గుప్పించారు చంద్రబాబు.

ఇదేనా సమగ్ర అధ్యయనం

‘సమగ్ర అధ్యయనం’ తరువాత చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో చేర్చిన ముఖ్యమైన అంశాలు- రైతు రుణ మాఫీ, బంగారు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ. వీటి అమలుకు లక్షా ఐదువేల కోట్ల రూపాయలు అవసరమని ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన తొలి ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. ఇంత మొత్తాన్ని భరించడం సాధ్యంకాదని ప్రభుత్వానికే కాదు, సాధారణ ప్రజలకు కూడా తెలుసు. అయినా ఆయన ఆ హామీ ఎందుకు ఇచ్చారు? ప్రజాందోళనలను అణచివేయడంలో తనకు ఉన్న నేర్పు మీద అపార నమ్మకం ఉండడమే కారణం. అధికారం అందని ద్రాక్షే అనుకుంటున్న సమయంలో ఇలాంటి హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు ఎదుట ఇప్పుడున్న పెద్ద సవాలు- తను ఇచ్చిన హామీలను నీరు గార్చడం ఎలా? అన్నదే.
 ఇందుకు మొదట ఆయన ఎంచుకున్న వ్యవస్థ భారతీయ రిజర్వు బ్యాంకు. రిజరుసబ్యాంకు ‘రుణమాఫీ వ్యతిరేకి’ అని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల ఇప్పటికే ముద్ర వేశారు. అయితే రిజర్వుబ్యాంకు రుణ మాఫీ  చేయదన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబుకీ తెలుసు. అంటే రిజర్వు బ్యాంకు ప్రజల శ్రేయస్సు ఆ దిశగా పని చేయటం లేదు. కాబట్టి ఆర్‌బీఐ మీద దండయాత్ర చేయమని అన్యాపదేశంగా ఆదేశాలి చ్చిట్లయింది. వర్షాలు పడి ఖరీఫ్ మొదలై రైతులు రుణాల కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేపడితే, మా వంతు ప్రయత్నం మేము చాలా నిబద్ధతతో చేశామనీ, బ్యాంకులు సహకరించట్లేద ని దాడికి ప్రోత్సహించినా  ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

బ్యాంకులపై నిందలెందుకు?

మొదటి సంతకం ఈ రుణమాఫీపైనే అని చంద్రబాబు ఘంటాపథంగా  చెప్పారు. మరి ఈ కోటయ్య కమిటీ ఎందు కు? 15 రోజులలో రావాల్సిన కమిటీ నివేదిక ఇంతవరకు ఎందుకు వెలుగు చూడదు? ఆర్‌బీఐనీ, కేంద్ర ప్రభుత్వాన్ని దోషులుగా చూపే మోసపూరిత ప్రయత్నాలెందుకు? ఈ హామీ రైతులకూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య నైతిక ఒప్పందం అని చంద్రబాబుకు తెలియదా? ఈ హామీలతో భవిష్యత్తులో తలెత్తే తీవ్ర పరిణామాలను గురించి ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, సీఎండీలు తెలియచేశారు. వేల కోట్లలో ఉన్న ఈ వ్యవసాయ రుణాలను మొండి బాకీలుగా చూపించే ప్రమాదముందని హెచ్చరించారు. మొత్తం రుణాల్లో వీటి శాతం దాదాపు 25 శాతం పైనే ఉందనీ,  ఇవన్నీ రాని బాకీలయితే బ్యాంకుల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినటమే కాక, లిక్విడిటీ దారుణంగా తయారయ్యే ప్రమాదముందని వివరించారు.ఈ పరిస్థితి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు శ్రేయస్కరం కాదని ఎస్‌ఎల్‌బీసీ సమావేశం వెల్లడించింది.

రుణ ప్రక్రియ రీషెడ్యూలింగ్

అసలు రైతు రుణాల ప్రక్రియ, వాటి రికవరీకి  విధివిధానాలు, వివిధ సంస్థలు, ప్రభుత్వాలు రైతులకిచ్చే సబ్సిడీలను ఒకసారి పరిశీలిద్దాం.    వ్యవసాయ రుణాలను షార్ట్‌టర్మ్ క్రాప్ లోన్స్, లాంగ్ టర్మ్ క్రాప్ లోన్స్ గానూ విభజిస్తారు. వరి, మిర్చి లాంటి వాటికి ఇచ్చేవి స్వల్పకాలిక రుణాలు. చెరకు, అరటి, మామిడి లాంటి పంటల సాగుకు ఇచ్చేవి దీర్ఘకాలిక రుణాలు. స్వల్పకాలిక రుణాలు ఆరు నెలలలోపున,  దీర్ఘకాలిక రుణాలు 18 నెలలలోపున చెల్లించాలి. వీటికి 12 నెలల గ్రేస్ పీరియడ్  ఉంటుంది. ఒకవేళ స్వల్పకాలిక రుణాలు 18 నెలలలోపున, దీర్ఘకాలిక రుణాలు 30 నెలలోపు చెల్లించకపోతే వాటిని రాని బాకీలుగా ప్రకటించాల్సి ఉంటుంది. సాధారణంగా వ్యవసాయ రుణాలపై 9 శాతం వడ్డీ విధిస్తారు. సకాలంలో చెల్లించిన అన్ని వ్యవసాయ పంట రుణాలపై వసూలు చేసే వడ్డీని ఆర్‌బీఐ 2 శాతం, కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం సబ్సిడీ రూపం లో ఇస్తాయి.  ప్రకృతి వైపరీత్యాల వలన కాని , ఇతర కారణాల వలన కాని పంటలు దెబ్బతిని సకాలంలో కనుక పంట రుణాలు చెల్లించకపోతే వాటిని రాని బాకీలుగా చూపితే ఆ రుణాలపై దాదాపు 11.25 శాతం వడ్డీ విధిస్తారు. అటువంటి రుణాల వడ్డీపై సబ్సిడీ ఉండదు. అసలు, వడ్డీ రైతే భరించాలి. ఇక కరువు బారిన పడిన మండలాల్లో ఉన్న పంట రుణాలు రీషెడ్యూలు చేయాల్సివస్తే రీషెడ్యూలు చేసిన రుణాలకు అదనంగా రైతు మరికొంత రుణ సదుపాయం బ్యాంకుల నుం చి పొందవచ్చు. అసలు చిక్కల్లా ఏ రుణాలను ఎంత మేరకు  మాఫీ చేస్తారో చంద్రబాబు చెప్పరు. యూపీఏ-2 ప్రభుత్వం దాదాపు రూ. 66,000 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేసినపుడు, ప్రయోజనం పొందని కొంతమంది రుణాలు చెల్లించలేదు. వారంతా చంద్రబాబు వైపే చూస్తున్నారు.  నిరంతరం డ్వాక్రా సంఘాలతో రద్దీగా ఉండే బ్యాంకులు ఈ రోజు ఆ సంఘాల మహిళలు లేక వెలవెల పోతున్నాయి. వస్తే రుణాలు చెల్లించమని అడుగుతారనే భయం. ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్’ అన్నీ నిర్వీర్వం అవుతున్నాయి. ఆ రుణాలు రికవరీ అవకపోవటం వలన, హామీ నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు ఒక్క అడుగు కూడ వేయకపోవడం వలన వారు తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం  కనిపించడం లేదు. వర్షాలు పడి ఖరీఫ్ సీజన్ మొదలయితే రైతుల పరిస్థితి, బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంటాయి. రుణమాఫీ, రుణమాఫీ కమిటీ ఏర్పాటు ఫైళ్ల మీద చంద్రబాబు ఎలాగూ సంతకం పెట్టారు కాబట్టి వ్యవసాయ రుణాలు వెంటనే రైతుల తరఫున బ్యాంకులకు చెల్లించాలి. లేనిపక్షంలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు, మేధావులు, రైతులు, మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ సవ్యంగానే జరుగుతాయని ఆశిద్దాం.     

(వ్యాసకర్త అఖిల  భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి)  బి. ఎస్.రాంబాబు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement