కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
♦ తెలంగాణ, ఏపీలో దొడ్డిదారిన భారీగా చేతులు మారిన రూ. 2 వేల నోట్లు
♦ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలులో దళారుల దందా
♦ ఈ ఐదు నగరాల్లో బ్యాంక్‌ల నుంచి భారీగా నగదు జారీ చేసిన బ్యాంకర్లు
♦ హైదరాబాద్‌లో 24 మంది ఉన్నతాధికారులపై విచారణ ప్రారంభం
♦ విజయవాడ, గుంటూరు, కర్నూలులో13 మంది అధికారుల అక్రమాలు
పెద్ద మొత్తంలో నగదు బయటకు రావడంపై రిజర్వు బ్యాంక్ ఆరా
కమీషన్ ప్రాతిపదికన పెద్దనోట్లు అందించినట్లు ఆరోపణలు
బేగంపేట్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి భారీగా నగదు బయటకు..
సహకార బ్యాంక్‌ల నుంచి రాజకీయ ప్రముఖులకు పెద్ద ఎత్తున నగదు!
రూ. 2 వేల నోట్ల సరఫరా, వినియోగంపై లెక్కలు తేల్చేపనిలో కేంద్ర ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్
గుట్టుచప్పుడు కాకుండా కొత్త నోట్ల బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందా? అందులో ఏకంగా బ్యాంకు అధికారులే భాగస్వాములయ్యారా? కమీషన్ ప్రాతిపదికన పాత నోట్లకు కొత్త నోట్లను ఇచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల సీనియర్ అధికారులు కొందరు రూ. 2 వేల నోట్లను బ్లాక్‌మార్కెటింగ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇష్టానుసారంగా ఈ నోట్లను కమీషన్ ప్రాతిపదికన బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలింది. రూ.1,000, 500 నోట్లను రద్దు చేసిన రెండోరోజు అంటే గురువారం నుంచి ఆదివారం దాకా భారీగా రూ.2 వేల నోట్లు పక్కదారి పట్టాయి. ప్రధాని పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించిన రెండోరోజు 40 శాతంగా ఉన్న కమీషన్ల దందా మంగళవారం వచ్చేసరికి 25 శాతానికి తగ్గింది. రూ.2 వేలనోట్లు భారీగా చలామణిలోకి రావడం వల్లే ఇలా జరిగిందని, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఈ దందా జోరుగా సాగుతోందని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించాయి. దీంతో మంగళవారం నుంచి బ్యాంక్ శాఖల వద్ద నిఘా పెరిగింది. ముఖ్యంగా గురువారం నుంచి ఆదివారం దాకా భారీ ఎత్తున నగదు బయటకు తరలించినట్లు తేలిన బ్యాంక్ శాఖల సిబ్బందిని పక్కనబెట్టి ఇతర శాఖల ఉద్యోగులను సర్దుబాటు చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు చెందిన 24 మంది సీనియర్ అధికారులు, విజయవాడ, గుంటూరు, కర్నూలులో 13 మంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు రిజర్వు బ్యాంక్ గుర్తించింది.
తీగలాగితే డొంక కదిలిందిలా..
రిజర్వు బ్యాంక్ హైదరాబాద్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు తన సమీప బంధువు ఒకరు ఫోన్ చేసి.. తన దగ్గర ఉన్న రూ.25 లక్షల పాత నోట్లు తీసుకుని కొత్తవి రూ.20 లక్షలు ఇస్తామంటున్నారు నమ్మవచ్చా అని అడిగారు. సదరు అధికారి మాటల్లో పెట్టి తన బంధువు నుంచి ఎవరు సమకూర్చబోతున్నారు? అతనికి ఎవరు ఇస్తామన్నారు? వంటి వివరాలను సేకరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే దిల్‌షుక్‌నగర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఆ బ్యాంక్ నుంచి నగదు మార్పిడి పేరిట డూప్లికేట్ పత్రాలు సృష్టించి రూ.50 లక్షల దాకా బయటకు తరలించినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్‌లో ఓ బ్యాంక్ చీఫ్ మేనేజర్..
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనకు సన్నిహితుడైన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 25 శాతం కమీషన్పై గత ఆదివారం రూ.2.5 కోట్లు సమకూర్చారు. ఆ నగదు విత్‌డ్రాకు ఆయన గడచిన గురు, శుక్రవారాల్లో నగదు మార్పిడికి వచ్చిన వారి పత్రాలను డూప్లికేట్ చేశారు. ఇంతపెద్దమొత్తంలో నగదు ఎందుకు విత్‌డ్రా చేశారని రిజర్వుబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు ప్రశ్నిస్తే మొదటి రెండు రోజులు వచ్చినవారే నాలుగోరోజు వచ్చారని బుకాయించారు. సోమవారం బ్యాంక్ సెలవు దినం కావడంతో దీనిపై మగంళవారం విచారణ ప్రారంభమైంది. ఒక్క జూబ్లీహిల్స్‌లోనే కాదు... నెల్లూరులో ప్రభుత్వ రంగ బ్యాంక్‌కే చెందిన ఓ సీనియర్ మేనేజర్ తన బ్రాంచ్ నుంచి ఏకంగా రూ.2 కోట్ల విలువైన వంద నోట్లను ఓ వడ్ల వ్యాపారికి విత్‌డ్రా చేసి ఇచ్చాడు. చిల్లర లేదని ఇబ్బంది పడుతూ నగదు మార్పిడికి వచ్చిన వారికి మాత్రం ఆయన రూ.2000 నోట్లు ఇచ్చాడు. వంద నోటు కావాలని గొడవ చేసినా లేవంటూ వడ్ల వ్యాపారికి మాత్రం కమీషన్కు ఆ నోట్లు అమ్ముకున్నట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. దీనిపైనా విచారణ ప్రారంభమైంది.
విజయవాడలోనూ ఇదే తంతు
విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాలుగు బ్యాంక్‌లకు అందించాల్సిన రూ.12.5 కోట్ల నగదులో నాలుగో వంతు తాను పంపించిన వారికి ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్లను పురమాయించాడు. పాత నోట్ల మొత్తానికి 30 శాతం తక్కువగా కొత్తవాటిని సరఫరా చేశారు. ఈ నోట్లు తీసుకున్న వారు వెంటనే ఏలూరులో 40 శాతం కమీషన్కు పాత నోట్లు తీసుకుని పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు పోలీసులను అప్రమత్తం చేసే లోపే దళారులు జారుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. ‘‘రూ.1000, రూ.500 పాత పెద్ద నోట్లు ఉంటే చెప్పండి...30 శాతం తక్కువకు కొత్త రూ.2000 నోట్లు సరఫరా చేస్తాం. మీ దగ్గర లేకపోతే మీకు తెలిసిన వారి దగ్గర ఉన్నా చెప్పండి. ఎంతైనా ఫర్వాలేదు. మేం పాతవి తీసుకుని కొత్తవి ఇవ్వడానికి సిద్ధం’’ అనేక చోట్ల ఇప్పుడు ఇదే సంభాషణ. అత్యవసరంగా నగదు కావాలనుకునే వారి నుంచి 40 నుంచి 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు సమకూర్చిన మొత్తంలో 80 శాతం నగదు బయటకు తరలించిన విషయం రిజర్వు బ్యాంక్ దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం ఆ బ్యాంక్‌కు బయటి నుంచి సిబ్బందిని తెప్పించి నగదు మార్పిడి, డిపాజిట్ల కార్యకలాపాల బాధ్యతలు అప్పగించారు.
నగదు తరలింపుపై కన్ను
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల నుంచి బ్యాంక్‌ల నుంచే భారీ ఎత్తున అక్రమంగా రూ.2 వేల నోట్లు బయటకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. రూ.500 నోట్లను తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు అందజేస్తే ప్రమాదకరమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం ఉదయమే ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని హెచ్చరించారు. అందువల్లే మంగళవారం ఇక్కడి బ్యాంక్‌లకు అందాల్సిన రూ.500 నోట్లను కావాలనే నిలుపుదల చేసినట్లు రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు సాక్షి ప్రతినిధికి చెప్పారు. రూ.2,000 నోట్లను బహిరంగ మార్కెట్‌కు తరలించిన సీనియర్ అధికారులను గుర్తించామని, అతి త్వరలోనే వారిపై వేటు వేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంలకు చెందిన 24 మంది ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై రిజర్వుబ్యాంక్ విచారణ జరుపుతోంది. మామూలు కంటే నగదు విపరీతంగా బయటకు తరలించిన బ్రాంచ్‌లు వాటికి కారకులైన అధికారుల జాబితాను రిజర్వుబ్యాంక్ ఇప్పటికే ఆయా బ్యాంక్‌ల యాజమాన్యాలకు అందజేసింది. విజయవాడ, గుంటూరు, కర్నూలులోనూ ఇలాంటి కార్యకలాపాలకుపాల్పడిన 13 మంది సీనియర్ అధికారులపైనా కన్నేసి ఉంచాలని రిజర్వుబ్యాంక్ సదరు బ్యాంక్‌ల ఉన్నతాధికారులను ఆదేశించింది.
కమీషన్లపై ఐబీ నివేదిక
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురంలో కమీషన్ల ప్రాతిపదికన పెద్ద ఎత్తున నగదు మార్పిడి జరుగుతోందంటూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఇది జోరుగా సాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. బ్యాంక్ సిబ్బంది లాలూచీ కారణంగానే పాత నోట్ల బ్లాక్ మార్కెటింగ్ అధికమైందని నివేదికలో తెలిపింది. అనంతపురం జిల్లాకు పొరుగున కర్ణాటక సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి కోట్ల రూపాయల్లో రూ.2 వేల నోట్లు వచ్చి చేరుతున్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, విజయవాడ నుంచి వ్యాపారులు అనంతపురంలో తిష్ట వేశారని కూడా ఐబీ హెచ్చరించింది. దీంతో మంగళవారం అనంతపురం సరిహద్దులోని కర్ణాటక
బ్యాంక్‌ల వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.
సహకార బ్యాంక్‌ల్లో నగదు పంపిణీ బంద్
రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించిన తర్వాత నగదు మార్పిడికి రాష్ట్రాల ఆధీనంలోని సహకార బ్యాంక్‌లకు రిజర్వు బ్యాంక్ అవకాశం ఇచ్చింది. అయితే ఈ బ్యాంక్‌లకు చేరిన మొత్తం ఖాతాదారులు, నగదు మార్పిడి కోసం వచ్చిన వారి కంటే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వారికే చేరుతున్నాయని గ్రహించింది. దీంతో రిజర్వుబ్యాంక్ మంగళవారం నుంచి ఆ బ్యాంకుల్లో కార్యకలాపాలను నిలుపుదల చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో సహకార బ్యాంక్‌ల నుంచి భారీగా డబ్బు రాజకీయ ప్రముఖులకు చేరినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీన్ని కొనసాగిస్తే ప్రమాదకరమని, రూ.2 వేలు, రూ.500 నోట్లు బ్లాక్‌మార్కెట్ అవుతాయని హెచ్చరించింది. దీంతో దేశవ్యాప్తంగా సహకార బ్యాంక్‌ల నుంచి నగదు కార్యకలాపాలు నిషేధిస్తున్నట్లు రిజర్వుబ్యాంక్ మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది కూడా వెల్లడించలేదు. ఆయా రాష్ట్రాల్లో సహకార బ్యాంక్‌లకు తరలించిన నగదు వివరాలపై విచారణ జరపాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది.