జల దిగ్బంధంలో గజగజ | A colony that spawns every time it rains | Sakshi
Sakshi News home page

జల దిగ్బంధంలో గజగజ

Published Mon, Jul 24 2023 3:23 AM | Last Updated on Mon, Jul 24 2023 9:07 AM

A colony that spawns every time it rains - Sakshi

కుత్బుల్లాపూర్‌/సుభాష్నగర్‌: ఆ కాలనీ వాసులు జల దిగ్బంధంలో చిక్కుకుని   బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. చినుకు పడిందంటే ఈ కాలనీ ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గాజుల రామారం డివిజన్‌లోని ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్‌ను నాలుగు రోజులుగా జల వలయం వీడకపోవడంతో స్థానికులు నిద్రాహారాలు మాని కాలం వెళ్లదీస్తున్నారు.

సమస్య ఉత్పన్నమైనప్పుడే అధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారే తప్ప ఆ తర్వాత ఇటువైపు చూసిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ వరద నీట మునిగింది. ఆదివారం వరకూ తేరుకోకపోవడంతో ఇక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.      

ఎందుకిలా..? 
సూరారం గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్‌ 70, 71లలో 24.22 ఎకరాల్లో రామారం పెద్ద చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎగువ ప్రాంతంలోని లింగా చెరువు, కొత్తచెరువు, ఎర్ర చెరువు, మానింగ్‌ ఒంపులలోని వర్షపు నీరు రామారం చెరువులో వచ్చి చేరుతోంది. భారీ వర్షం వచ్చినప్పుడు రామారం చెరువు ఉద్ధృతంగా ప్రవహించి పరిక చెరువులో కలుస్తోంది 

కట్టు కాల్వను ప్లాట్లుగా మార్చి..  
వెంచర్‌ ప్రారంభంలో కాలనీలో ఉన్న మొత్తం ప్లాట్లు అమ్ముడుపోగా.. కొంతమంది కళ్లు కాలనీ నుంచి వెళ్తున్న 30 ఫీట్ల కట్టు కాల్వపై పడ్డాయి. దీనిని ప్లాట్లు చేసి రూ.కోట్లు గడించారు. ఏడేళ్ల క్రితం ప్లాటింగ్‌ చేస్తున్న సమయంలో మూడేళ్ల వరకు వర్షాలు అంతంత మాత్రమే పడడం, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల అండదండలు ఉండడంతో కట్టు కాల్వపై నిర్మాణాలు వెలిశాయి.   

కబ్జా బాగోతం వెలుగులోకి..  
2022లో భారీ వర్షాలు పడడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు మార్గం లేక కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో కాలనీవాసులు రెండు నెలలుగా పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై ‘సాక్షి’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. 

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందం పరిశీలన..  
కట్టు కాలువ కబ్జా విషయమై గాజుల రామారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  గత ఏడాది మార్చి నెలలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్‌ఎండిఏ, పీసీబీ, ఫారెస్ట్, జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు పరిశీలించి వెళ్లారే తప్ప చర్యలు తీసుకోలేదు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందం పరిశీలించిన అనంతరం 274 నిర్మాణాలు కట్టు కాల్వపై వెలిసినట్లు గుర్తించారు. వీటిలో 24 నిర్మాణాలను తక్షణమే తొలగించాలని మార్కింగ్‌ కూడా వేశారు. కానీ అంతటితోనే ఆపివేయడం గమనార్హం.  

ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..  
ప్లాటు కొనుగోలు చేసేటప్పుడు కాలనీలో సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పారు. అసలు కట్టు కాల్వపై ప్లాట్లు చేశారనే విషయమే మాకు తెలియదు. గత ఏడాది నుంచి భారీ వర్షాలు పడటంతో కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలి. 
– శంకరాచారి, ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ వాసి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement