స్లాట్ బుకింగ్‌కు అందని ‘మీ-సేవ’
- పని ఒత్తిడితో సేవలు నిల్
- బుక్ చేసే కేంద్రాలు తెలియక ప్రజల పాట్లు
విశాఖపట్నం: పాస్‌పోర్ట్ సేవలు ‘మీ-సేవ’ కేంద్రాలలో పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కేంద్రాలలో సేవలు ప్రారంభించారు. అయితే ‘మీ-సేవ’ కేంద్రాలలో ఈ సేవలు సంతృప్తికరంగా అందడం లేదు. బ్రోకర్లు, దళారీల వ్యవస్థ నియంత్రణకు సిద్ధపడ్డ పాస్‌పోర్ట్ అధికారులు తొలి విడతగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 200మంది ‘మీ-సేవ’ ప్రతినిధులకు ఈ ఏడాది జూలై 19న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు.
ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ బుకింగ్, దరఖాస్తులు పూరించడం, ఫీజులు చెల్లించడాన్ని నేర్పించారు. పాస్‌పోర్ట్ సేవలు గురించి అవగాహన కల్పించారు. మరో రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని అధికారులు ప్రకటించారు. తర్వాత శిక్షణ ప్రస్తావన మరిచారు. ప్రతి జిల్లాలో 213 ‘మీ-సేవ’ కేంద్రాలు అందుబాటులో ఉండగా పది శాతం కేంద్రాలలో కూడా సేవలు లభించడం లేదు.
గందరగోళంగా సేవలు...
గ్రామీణ ప్రాంత ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో ‘మీ-సేవ’ కేంద్రాలలో సేవలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సర్వీసులతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసులతో పాస్‌పోర్ట్ సేవలు అనుసంధానం చేశారు. ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ సేవలకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ ఉండేటట్టు చర్యలు చేపట్టారు. అయితే ఏ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు లభిస్తాయో ప్రజలకు అర్థం కావడం లేదు. రూ.100 చెల్లించి సేవలు పొందవచ్చని ఆశపడుతున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. ‘మీ-సేవ’ కేంద్రంలో ఒక కౌంటరే పనిచేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్, విద్యుత్, ఇంటి పన్నులతోపాటు పాస్‌పోర్ట్ సేవల కోసం అభ్యర్థులు వేచి ఉంటున్నారు. రద్దీ సమయంలో పాస్‌పోర్ట్ సేవలు చేయలేమని కేంద్రాలలో చెబుతుండటంతో కంగుతింటున్నారు.
అన్ని కేంద్రాలలో ప్రారంభించాలి...
ప్రతి ‘మీ-సేవ’ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు లభించేటట్టు అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆన్‌లైన్ సేవలలో అడ్డంకులు, విద్యుత్ సరఫరా అంతరాయంతో పనులు జరగడం లేదని వాపోతున్నారు. ప్రత్యేక మేళాలలో స్లాట్ బుకింగ్‌లు దొరకపోవడంతో నీరుగారుతున్నారు. మేళాలో పాల్గొనడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నట్టు చెబుతున్నారు.
చేపట్టాల్సిన చర్యలు
ఆయా జిల్లా, మండలాలలో పాస్‌పోర్ట్ సేవలు లభించే ‘మీ-సేవ’ కేంద్రాల వివరాలు తెలియజేయాలి.
‘మీ-సేవ’ కేంద్రాలలో పనితీరును అధికారులు పర్యవేక్షించాలి, లోటుపాట్లను అధిగమించాలి.
స్లాట్ బుకింగ్‌లు ప్రజలకు మరింత చేరువ చేయాలి.
బ్రోకర్ల స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలి.
ప్రత్యేక మేళాల బుకింగ్‌లు జరుగుతున్న తీరుపై నిఘా ఉంచాలి.